బాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. నెల రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబై లోని కోకిలాబేన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గత నెల రోజులుగా అయనకు చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇస్మాయిల్ ష్రాఫ్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ష్రాఫ్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు ష్రాఫ్. చదువు పూర్తయిన తర్వాత సినిమాపై ఉన్న ఆసక్తితో బాలీవుడ్ వెళ్లారు. అక్కడ బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కొంత కాలం పనిచేశారు ష్రాఫ్. తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ష్రాఫ్. ఆ తర్వాత అహిస్తా అహిస్తా, జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్దూర్, దిల్ ఆఖిర్ దిల్ హై, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝూతా సచ్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు తీసారాయన. ఆయన దర్శకుడిగా పనిచేసిన చివరి చిత్రం 2004 లో విడుదలైన 'తోడా తుమ్ బద్లో తోడా హమ్'. ఈ సినిమా లో ఆర్య బబ్బర్ ఇంకా శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇస్మాయిల్ ష్రాఫ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నటుడు గోవిందా మాట్లాడుతూ.. ఇస్మాయిల్ ష్రాఫ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన సినిమా కెరీర్ ఇస్మాయిల్ తోనే మొదలైందని తన మొదటి సినిమా 'లవ్ 86' కు ఇస్మాయిల్ దర్శకుడని అన్నారు. గోవింద్ లాంటి వ్యక్తిని గోవిందాగా సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి ఇస్మాయిల్ అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ నటి పద్మిని కొల్లాపూర్ ఇస్మాయిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయనతో 'తొడిసి బెవఫై', 'అహిస్తా అహిస్తా' వంటి సినిమాలు చేసానని అన్నారు. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆయన ఉండేవారని, నటులతో చక్కగా కలిసిపోయేవారని అన్నారు. 'అహిస్తా అహిస్తా' సినిమా చేస్తున్న సమయంలో తాను తోటి నటులతో మాట్లాడుకునేవాళ్ళమని ఆ మాటలు అర్థం కాక ఇస్మాయిల్ మమ్మల్ని అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, సున్నితంగా ఉండే మనిషి ఇస్మాయిల్ అని పేర్కొన్నారు. అలాంటి దర్శకుడు ను కోల్పోవడం బాలీవుడ్ కి తీరని లోటని వ్యాఖ్యానించారు.
Also Read : విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య & ఇంకా - సమంత 'యశోద'కు పాన్ ఇండియా హీరోల సపోర్ట్
సినీ నిర్మాత అశోక్ పండిట్ ఇస్మాయిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇస్మాయిల్ మృతి వార్త బాధించిందని, ఎన్నో ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించిన మంచి డైరెక్టర్ ను కోల్పోవడం పరిశ్రమకు తీరని నష్టం అని ట్వీట్ చేశారు. మరోవైపు ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ శోక సంద్రం లో మునిగిపోయింది. బాలీవుడ్ ప్రముఖులంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.