స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద' (Yashoda Movie). శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంత కంటే ముందు... రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
తెలుగులో విజయ్ దేవరకొండ...
తమిళంలో సూర్య & ఇంకా ఇంకా!
యంగ్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'యశోద' తెలుగు ట్రైలర్ (Yashoda Trailer) లాంచ్ చేయనున్నారు. తమిళంలో సూర్య చేతుల మీదుగా విడుదల కానుంది. హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో 'మహానటి', 'సీతా రామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నారు. వీళ్ళందరూ తమ తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేస్తారు.
'యశోద' సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాలను సైతం ఒక ప్లానింగ్ ప్రకారం ఐదు భాషల్లో చేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలతో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేశారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత సమంతకు ఉత్తరాదిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదొక్కటే కాదు... ఇప్పుడు ఆమె హిందీలో సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథాంశాలను ఎంపిక చేసుకుంటున్నారు. 'యశోద' సినిమాలో కూడా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది.
Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?
సమంత గురించి శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''సమంత 'యశోద' పాత్రను సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎంతో డెడికేషన్‌తో యాక్షన్, ఇతర సీన్స్ అద్భుతంగా చేశారు. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్'' అని అన్నారు. ఉన్నత నిర్మాణ & సాంకేతిక విలువలతో ఆయన సినిమా రూపొందించారు.
Samantha Upcoming Movies : 'యశోద' కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం', శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలు సమంత చేస్తున్నారు. అందులో 'శాకుంతలం' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఆ రెండూ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యే చిత్రాలే.
హరి - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్న 'యశోద'లో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.