Etela Rajender : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరు పదే పదే ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఈటల అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటల... తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా హ్యాపీగా లేరన్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఇప్పటి వరకూ వారికి జీతాలు రాలేదన్నారు. రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా 12వ తేదీ వరకు జీతాలు రాలేదన్నారు. సభలో సంఖ్యా బలంతో గంటలసేపు అధికార పార్టీ వారు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను మభ్య పెట్టి మాయ చేయాలని చూశారన్నారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నో మాటలు చెప్పారని, అయినా ప్రజలు నమ్మరన్నారు.
చెప్పిన లెక్కలన్నీ తప్పే
"తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మళ్లీ దేశానికి ప్రధాని మోదీనే. సగానికి పైగా సీఎం చెప్పిన లెక్కలు తప్పు. 140 కోట్ల ప్రజలు గౌరవించే వ్యక్తి మోదీ అని ఈటల రాజేందర్ అన్నారు. నేను పార్టీ మారలేదు, వాళ్లే నన్ను గెంటివేశారు. గెంటివేసిన వాళ్లు మళ్లీ పిలిచినా పోను. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈటల చరిత్ర తెలిసిన వాళ్లు నా గురించి తక్కువ ఆలోచన చేయరు. ఈటల పార్టీ మారుతున్నారు అని, వైఎస్ హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఇవాళ సీఎం నా పేరు ప్రస్తావన చెప్పగానే పొంగిపోను. నా మీద చేసిన దాడి మరిచిపోను" - ఈటల రాజేందర్
బీజేపీలో సైనికుడిగా పనిచేస్తా
నేను అడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన పొంగిపోనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ లో కూడా సైనికుడిగా పనిచేశానని, బీజేపీ లో కూడా సైనికుడిగా పనిచేస్తా అని ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ లీడర్, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడునని సభలో తనకు సొంత అజెండా ఉండదన్నారు. తెలంగాణ ప్రజల గొంతు వినిపించానన్నారు. మెస్ ఛార్జీల మీటింగ్ కి పిలిస్తే తప్పకుండా వెళ్తా అని ఈటల రాజేందర్ అన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు ఎప్పుడూ జరగలేదన్నారు. ఒక్కో రోజు ఒక్కో పద్దుపై చర్చలు జరిగేవన్నారు. బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సభలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మందబలం ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సభలో చెప్పింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
కేసీఆర్ మాటలకు పడిపోను
"ఈటల రాజేందర్ కేసీఆర్ మెతక మాటలకు పడిపోడు. 2004లో కూడా వైఎస్ తో కలుస్తారని, ఆపరేషన్ ఆకర్ష్ లో ఉన్నాడని అన్నారు. ఆనాడు పోలేదు ఇవాళ పోడు. నాపై వాళ్లు చేసిన దాడి, పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదు. పలకరించుకుంటే...పక్కన కూర్చుంటే పార్టీలు మారను. నేను పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. వాళ్లే నన్ను బయటకు పంపారు. మళ్ళీ నన్ను పిలిచినా నేను పోను. ముఖ్యమంత్రి తన స్టైల్ లో మాట్లాడారు..భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేరును కూడా అలానే పిలుస్తారు. అసెంబ్లీకి నేను వచ్చింది ప్రజల సమస్యల పై చర్చ కోసం. ఎన్ని రోజులు నన్ను ఆపగలిగారు?" - ఈటల రాజేందర్