నారా లోకేష్ పాదయాత్రలో నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స అందించారు. కానీ, ఆయన పరిస్థితి విషమించడంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యాన్ని నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తారకరత్నకు విదేశీ వైద్యుల చికిత్స
ప్రస్తుతం తారకరత్నకు ప్రత్యేక విదేశీ వైద్య బృందం చికిత్స అందిస్తోంది. తారకరత్న చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్లు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తారకరత్న హార్ట్, న్యూరో సమస్యలకు మెరుగైన వైద్యం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వెల్లడించారు. వైద్యులు శక్తి వంచన లేకుండా ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
రక్తప్రసరణ ఆగడంతో పరిస్థితి విషమం
వాస్తవానికి తారకరత్న గుండెపోటుకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రికి వెళ్లేందుకు సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. ఈ మధ్యలో ఆయన శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రభావం మెదడుపైన తీవ్రంగా పడింది. ఇదే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారేందుకు కారణం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. మరోవైపు మెదడుకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గుండె కూడా చాలా వరకు బలహీనం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తారకరత్న పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం విదేశీ వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గుండె, నాడీ వ్యవస్థలను యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అత్యధునిక వైద్య చికిత్సను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన
మరోవైపు తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. పూర్తిగా కోలుకుని ఎప్పటిలాగే ప్రజల ముందుకు రావాలని ఆశిస్తున్నారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తారకరత్న పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ఆయనను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు బెంగుళూరుకు వెళ్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తారకరత్న పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాగైనా ఆయనను కాపాడాలని డాక్టర్లను కోరుతున్నారు.
Read Also: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక
తారక రత్న కోసం... బాలకృష్ణ వాయిదా!
కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ నెల మూడో వారంలో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి జనవరి నెలాఖరున లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారని తెలిసింది. నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున కుప్పంలో పాల్గొన్న బాలకృష్ణ ఆ తర్వాత హైదరాబాద్ రావాలని ప్లాన్ చేశారట. తారక రత్నకు గుండెపోటు రావడంతో అనూహ్యంగా ఆయన షెడ్యూల్ మారింది. కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఆర్టిస్టుల డేట్స్ అవీ చూసుకుని ఈ నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.