TRS Joinings : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తుండడంతో పార్టీల మధ్య జంపింగ్ లు మొదలయ్యాయి. పలువురు కీలక నేతలు టీఆర్ఎస్, బీజేపీలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ నేతలు దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గురువారం బూడిద భిక్షమయ్య గౌడ్‌ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని దాసోజు శ్రవణ్‌ అన్నారు. నోట్లు పంచిపెట్టి మునుగోడు ఉపఎన్నికలో గెలవాలనుకుంటున్నారని బీజేపీ తీరును నిరసిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శ్రవణ్‌ తెలిపారు. 






బీజేపీలో అడుగడుగునా అవమానాలు


తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్ అన్నారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని ఆరోపించారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం విమర్శించారు. నిబద్ధత, నిజాయితీతో ప్రజాసమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తున్న బలహీనవర్గాల కార్యకర్తలు, నాయకుల పట్ల బీజేపీ తీరు ఆక్షేపనీయం అన్నారు.  పార్టీలో తన లాంటి వారికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. బీజేపీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేకపోతున్నానన్నారు.   పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు లేఖ రాశారు. 



బ్యాక్ టు టీఆర్ఎస్ 


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తాను రాజకీయం చేయదల్చుకుంటే ఎలా ఉంటుందో మరోసారి చేసి చూపిస్తున్నారు. ఇంత పార్టీలో నేతలు ఎవరు బయటకు వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోలేదు. బుజ్జగింపులు చేయలేదు. టీఆర్ఎస్ కన్నా మంచి అవకాశాలు బయల లభిస్తే వెళ్లేవారు వెళ్లవచ్చన్నట్లుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క సారిగా స్టైల్ మార్చారు. వెళ్లిన వాళ్లందరికీ మళ్లీ ఆహ్వానం పలుకుతున్నారు. స్వయంగా కేసీఆర్ పిలిస్తే రాని వాళ్లు ఉంటారు.. ఎవరో ఒకరిద్దరు తప్ప. అందుకే ఇతర పార్టీల్లో చేరిన కీలక నేతలంతా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఉద్యమకారులు ఎక్కువగా ఉన్నారు.  


ఆపరేషన్ ఆకర్ష్ 


తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్ లీడర్లను చేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇటీవలే మునుగోడులో బీసీ లీడర్లను ఆకట్టుకునేందుకు భువనగిరి మాజీ ఎంపీ స్వామిగౌడ్‌ను చేర్చుకున్నారు. మరికొంత మందితోనూ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల్ని బీజేపీలోకి తెచ్చేందుకు ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ వెంటనే అప్రమత్తమయ్యారు. తాను రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ఫోన్ కాల్స్‌తో పార్టీ వదిలి వెళ్లిపోయిన కీలక నేతల్ని వెనక్కి తెప్పిస్తున్నారు. కేసీఆర్ పిలిస్తే చాలు.. వెనక్కి వచ్చేస్తామన్నట్లుగా కొంత మంది నేతల తీరు ఉంది. అందుకే కేసీఆర్ పిలుపులు వర్కవుట్ అవుతున్నాయి.