KCR Operation Akarsh : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తాను రాజకీయం చేయదల్చుకుంటే ఎలా ఉంటుందో మరోసారి చేసి చూపిస్తున్నారు. ఇంత పార్టీలో నేతలు ఎవరు బయటకు వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోలేదు. బుజ్జగింపులు చేయలేదు. టీఆర్ఎస్ కన్నా మంచి అవకాశాలు బయల లభిస్తే వెళ్లేవారు వెళ్లవచ్చన్నట్లుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క సారిగా స్టైల్ మార్చారు. వెళ్లిన వాళ్లందరికీ మళ్లీ ఆహ్వానం పలుకుతున్నారు. స్వయంగా కేసీఆర్ పిలిస్తే రాని వాళ్లు ఉంటారు.. ఎవరో ఒకరిద్దరు తప్ప. అందుకే ఇతర పార్టీల్లో చేరిన కీలక నేతలంతా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఉద్యమకారులు ఎక్కువగా ఉన్నారు.
పార్టీ వదిలి వెళ్లిపోయిన వారికి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం !
తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్ లీడర్లను చేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇటీవలే మునుగోడులో బీసీ లీడర్లను ఆకట్టుకునేందుకు భువనగిరి మాజీ ఎంపీ స్వామిగౌడ్‌ను చేర్చుకున్నారు. మరికొంత మందితోనూ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల్ని బీజేపీలోకి తెచ్చేందుకు ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ వెంటనే అప్రమత్తమయ్యారు. తాను రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ఫోన్ కాల్స్‌తో పార్టీ వదిలి వెళ్లిపోయిన కీలక నేతల్ని వెనక్కి తెప్పిస్తున్నారు. కేసీఆర్ పిలిస్తే చాలు.. వెనక్కి వచ్చేస్తామన్నట్లుగా కొంత మంది నేతల తీరు ఉంది. అందుకే కేసీఆర్ పిలుపులు వర్కవుట్ అవుతున్నాయి.
కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ !
దాసోజు శ్రవణ్ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆయన ఉద్యమకారుడు. అయితే సామాజికవర్గం కారణంగా టిక్కెట్ దక్కలేదని అసంతృప్తికి గురై.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో ఆయనను ఆపాలని టీఆర్ఎస్ నేతలు ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన కావాలని టీఆర్ఎస్ నేతలనుకున్నారు. మంచి మాట చాతుర్యం, బీసీ వర్గాల్లో పలుకుబడి ఉన్న నేత కావడంతో కేసీఆర్ .. మళ్లీ పిలిచారు. కేసీఆర్ పిలిస్తే చాలనుకున్న దాసోజు శ్రవణ్ వెంటనే.. అంగీకరించారు. బీజేపీలో చేరి రెండు నెలలే అయినా ఆయన మొహమాటపడలేదు. ఇక శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఉద్యోగ సంఘంనేత అయిన స్వామిగౌడ్ కు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మండలి చైర్మన్ చేశారు. అయితే పదవి కాలం ముగిసిన తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదన్న అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతల పిలుపుతో .. కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మళ్లీ స్వయంగా ఆహ్వానించడంతో మరో మాట లేకుండా అంగీకరించారు. ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. బీజేపీకి రాజీనామా లేఖ పంపారు.
ఇంకా ఎంత మంది వెనక్కి వస్తారు ?
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు కూడా ఇటీవలే కేసీఆర్‌ను కలిసిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ చేరడానికి ముహుర్తం సిద్ధమయింది. ఇక టీఆర్ఎస్‌లో చేరేందుకు పార్టీని వీడిపోయిన పలువురితో చర్చలు జరుపుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఓ మాజీ ఎంపీతో పాటు మరికొంత మంది గతంలో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు రాజకీయంగా కీలక పరిస్థితుల్లో ఉన్నామని కలసి నడుద్దామని కేసీఆర్ పిలుస్తున్నారు. దీంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తిరిగి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.