Etela Rajender On TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై కు ఫిర్యాదు చేశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలు కలిశారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్...  టీఎస్పీఎస్సీలో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. 



అభ్యర్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలి


 "కేసీఆర్ విద్యార్థుల కళ్లలో మట్టి కొట్టారు. ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎగ్జామ్ రద్దు చేస్తున్న అని కేసీఆర్ తప్పించుకుంటున్నారు. కేసీఆర్ కి రాజకీయాలు తప్ప  తెలంగాణ ప్రజల గురించి పట్టింపులేదు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలి. ప్రభుత్వ మెడలు వంచుదాం. అభ్యర్థుల్లో  ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్ ని కోరాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీ పైనే ఉంది. పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే TSPSC ఏంచేస్తుంది. సీసీ కెమెరాల ఎందుకు పనిచేయడం లేదు. రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతీ విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు" - ఈటల రాజేందర్  


సిట్ నివేదికలో సంచలనాలు 


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసె కమిషన్ - టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిట్ అధికారుల దర్యాప్తులో విస్మయ పరిచే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ ఇద్దరు కలిసి అక్టోబర్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతా తానై వ్యవహరించే రాజశేఖర్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి వివరాలను అయినా దొంగలించి ప్రవీణ్ కు అందజేసే వాడని తేలింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ చేసిన అక్రమాలు చూసి ఉన్నత అధికారులు సైతం విస్తుపోతున్నారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేయగా ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్ తో కలిసి ఏఈఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారన్నదంతా అబద్ధమని తేలింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం ఏఈఈ పరీక్షకు మాత్రమే పరిమితం కాలేదని, అలా నమ్మించేందుకు మాత్రమే రేణుక ప్రస్తావన తెచ్చాడని తేలింది. వాస్తవానికి మిగతా ప్రశ్నాపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది.


అక్టోబర్ లోనే ప్రశ్నాపత్రల దొంగతనం


కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగలించి దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నాపత్రాలు ఉన్న ఫోల్డర్ ను నాలుగు పెన్ డ్రైవ్ లలో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అక్టోబరులోనే ప్రశ్నాపత్రాలు తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ లో జరిగిన గ్రూపు-1 ప్రిలీమ్స్ లో ప్రవీణ్ కు మంచి మార్కులు వచ్చాయి. ఈ విషయం అధికారులకు తెలియడంతో కొత్త అనుమానాలు వచ్చాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా.. అక్టోబరు నుండే ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.