Hero Nithin JP Nadda Meeting : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కు వచ్చిన హీరో నితిన్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. నితిన్ తో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రామచంద్రరావు ఉన్నారు.  హనుమకొండ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభకు హాజరైన జేపీ నడ్డా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. శనివారం ఉదయం క్రికెటర్ మిథాలీ రాజ్ ను కలిశారు. అయితే నితిన్ తో భేటీపై సర్వత్రా చర్చ నెలకొంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూ.ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది.



బీజేపీ గ్లామర్ పాలిటిక్స్ 


బీజేపీ గ్లామర్ పాలిటిక్స్ లో భాగంగానే సినీహీరోలతో భేటీలు అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. 2018లో కర్ణాటకలో గ్లామర్ పాలిటిక్స్ ఫార్ములా అమలు చేశారని, అప్పట్లో బీజేపీ పెద్దలు యశ్, సుదీప్ లను కలిశారని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలోనూ బీజేపీ గ్లామర్ పాలిటిక్స్ ఫార్ములాతో ముందుకెళ్తుందంటున్నారు. ఇప్పటికే జీవితా రాజశేఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకోగా, సినీ నటి జయ సుధ కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 


మిథాలీతో భేటీ 


హనుమకొండ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా శనివారం ఉదయం నొవాటెల్‌ హోటల్ క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంపై చాలా ఆసక్తి నెలకొంది. ఏం చర్చించారనే మాత్రం బయటకు రాలేదు. ఈ భేటీ తర్వాత జేపీ నడ్డా హన్మకొండ సభకు వెళ్లారు.  క్రికెటర్ మిథాలీ అప్పుడప్పుడు ప్రధాని మోదీతో సహా బీజేపీ ప్రముఖులు పెట్టిన పోస్టులను షేర్ చేస్తుంటారు. దేశానికి సంబంధించిన విషయాలపై ఆమె రియాక్ట్ అవుతుంటారు. కేంద్రం చేపట్టే చాలా పథకాలకు అనుకూలంగా రీట్వీట్ చేస్తుంటారు. దీంతో ఆమెతో నడ్డా భేటీకి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఇటీవల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రచారం జరుగుతోంది. 


జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ 


జేపీ నడ్డాతో సమావేశం ముగిసిన అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. బీజేపీ నేతల ఆహ్వానం మేరకు హీరో నితిన్ జేపీ నడ్డాను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ అంశాలపై ఏమైనా చర్చ జరిగిందా? నితిన్ ను బీజేపీలోకి ఆహ్వానించారా? అనే అంశాలపై ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ మీటింగ్ పై జోరుగా ప్రచారం జరిగింది. టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల చూశారట. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను ప్రశంసించడానికే యంగ్ టైగర్‌ను కేంద్ర మంత్రి షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెప్పారు. ఎన్టీఆర్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడు,  తెలుగు సినిమా తారకరత్నం అని, హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని అమిత్ షా ట్వీట్ కూడా చేశారు.  


భేటీలపై ఎంపీ డా.కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు 


నితిన్, మిథాలీతో జేపీ నడ్డా సమావేశాల్లో రాజకీయ చర్చ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. వీరి భేటీపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్, మిథాలీ ప్రధాని మోదీ పాలనకు ఆకర్షితులయ్యారన్నారు. త్వరలోని వీరిద్దరూ ప్రధానిని కలిసే ఏర్పాట్లు చేస్తామన్నారు. పార్టీకి సేవలందించేందుకు నితిన్, మిథాలీ సిద్ధంగా ఉన్నారన్నారు. అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీలోనూ రాజకీయ చర్చ జరిగి ఉండవచ్చన్నారు. 


Also Read : క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ- సాయంత్రం హీరో నితిన్‌తో సమావేశం


Also Read : JP Nadda : కేసీఆర్ నయా నిజాం, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం - జేపీ నడ్డా