Bandi Sanjay Letter To CM KCR : ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ బాకాయిలు వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు విడుదల చేయకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్భాటపు ప్రచారం చేసుకోవడానికి, దేశవ్యాప్తంగా వివిధ పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుందని ఆరోపించారు. కానీ బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం నిధులు కేటాయించకపోవటం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల  సంక్షేమం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనడానికి నిదర్శనం అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి 4 వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అనేక మంది బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఫీజులు కట్టడం కోసం రక్తాన్ని అమ్ముకుంటున్నారని, ఇది చాలా దురదృష్టకరమని బండి సంజయ్ తెలిపారు. 


సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు
 
ఇంజినీరింగ్‌, ఫార్మసీ,  ఎంటెక్‌, ఎంబీఎ, ఎంసీఎ, పీజీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మొత్తం ఫీజులు విద్యార్థులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ఇంకా రెండు, మూడో సంవత్సరం విద్యార్థులను కూడా ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత విద్యార్థులకు తిరిగి ఫీజులను వాపస్‌ ఇస్తామని ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్తూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి  ఫీజులు వసూలు చేస్తున్నారు. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫీజులు కట్టకపోతే క్లాసులకు రానివ్వటం లేదు. దీంతో విద్యార్థుల చదువు దెబ్బతింటోంది. ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందినవారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. హాల్‌ టికెట్లు ఇవ్వడం లేదు. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 


ర్యాంకుల నిబంధన ఎత్తివేయాలి


రాష్ట్రప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులతో పాటు ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులకు తలెత్తుతున్నాయని బండి సంజయ్ అన్నారు. విద్యాసంస్థలు నడపడం వారికి పెనుభారంగా మారిందన్నారు. అనేక ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బోధనా సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. బోధనా సిబ్బందికి వేతనాలు చెల్లించని పక్షంలో వారు నాణ్యమైన విద్యను ఏవిధంగా అందించగలరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నత విద్యను పొందలేకపోతున్నారన్నారు.  రాష్ట్రప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులో చేరడానికి ర్యాంకుల నిబంధన ఎత్తివేసి అర్హులందరికీ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల్లో కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నట్లు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే 4 వేల కోట్ల రూపాయలను బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు. ఇంజినీరింగ్‌ కోర్సులో చేరే విద్యార్థులకు ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ నెలాఖరు లోపు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొ్న్నారు.