Kerala Norovirus: ఓ వైపు కరోనా కేసులు పెరుగుతోన్న వేళ కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా రెండు నోరో వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరో వైరస్ సోకినట్లు పేర్కొంది.
ఆందోళన వద్దు
చిన్నారుల ఆరోగ్యంపై ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇలా తెలిసింది
విజింజంలోని ఎల్‌ఎంఎస్‌ఎల్‌పీ స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపగా అందులో ఇద్దరికి నోరో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. నోరో వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.
2021 నవంబర్‌లో కేరళలో మొదటిసారిగా నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. వయనాడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు నోరో వైరస్ ఉన్నట్లు నిర్ధారణయింది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు. తాజాగా మరోసారి నోరో వైరస్ వచ్చింది.
నోరో వైరస్
నోరోవైరస్ అనేది అంటువ్యాది. ఇది ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరో వైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందవచ్చు. నోరో వైరస్ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు.
Also Read: Corona Cases: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు- కొత్తగా 4,518 మందికి వైరస్
Also Read: Online Mobile Gaming: సీక్రెట్‌గా ఆన్‌లైన్‌లో బెట్టింగ్, తరవాత జరిగింది ఇదీ..