ఆన్‌లైన్ ఆటలో రూ.36 లక్షలు మాయం


ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగి తేలిపోవటం ఈ రోజుల్లో అందరికీ అలవాటైపోయింది. బస్సులు, రైళ్లు, కార్లు ఇలా ఎక్కడ కూర్చున్నా సరే మొబైల్‌లో గేమ్స్ ఆడేస్తుంటారు. పెద్దలే  కాదు పిల్లలూ ఈ ఆటలకు బాగా అలవాటు పడిపోయారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో పిల్లలంతా ఇళ్లకే పరిమితమవటం, బయటకు వెళ్లకూడదని ఇంట్లో వాళ్లు ఆంక్షలు పెట్టడం వల్ల వాళ్లకు ఫోన్లే లోకమైపోయాయి. ఆ క్రమంలోనే ఆటలూ ఆడటం మొదలు పెట్టారు. మొదట్లో ఏదో పావుగంట, అరగంట ఆడిన వాళ్లు గంటల తరబడి వాటికే అతుక్కుపోవటం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు వారించినా వినకుండా ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసలైపోయారు. కాలక్షేపం కోసం ఆడితే పర్లేదు కానీ తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు కొందరు విద్యార్థులు. కనిపించిన ప్రతి లింక్‌ని క్లిక్ చేస్తూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.  హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంటర్మీడియట్ స్టూడెంట్ తన తల్లికి తెలియకుండా ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతూ ఏకంగా  36 లక్షలు పోగొట్టాడు. 
 
పిల్లలకు ఫోన్‌లు వాడుతున్నప్పుడు నిఘా ఉంచండి: సైబర్ నిపుణులు
తన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కనిపించకపోయే సరికి పోలీస్ స్టేషన్‌కు ఆమె పరుగులు పెట్టగా..."మీ అబ్బాయే ఆన్‌లైన్ గేమ్‌ ఆడి డబ్బు పోగొట్టాడు" అన్న పోలీసుల సమాధానం విని కంగుతింది. పోలీసులు విద్యార్థిని విచారించగా అసలు విషయం బయట పడింది. కొన్ని రోజుల క్రితం తాతయ్య ఫోన్‌లో ఓ బెట్టింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేశాడు యువకుడు. తల్లి బ్యాంక్ అకౌంట్ క్రెడెన్షియల్స్‌తో ఓ గేమ్‌ని యాక్సెస్ చేశాడు. కొంత ఫీజ్ కట్టి ఆడటం మొదలు పెట్టాడు. గేమ్ ఆడే క్రమంలో బెట్టింగ్‌లు పెడుతూ వచ్చాడు. అది కాస్త వ్యసనంగా మారింది. ఇలా నెల రోజుల్లో ఖాతాలోని 36 లక్షలు ఖాళీ చేశాడు. అనుకోకుండా ఓసారి బ్యాంక్‌కి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకుని హడావుడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ విద్యార్థి తల్లి. బ్యాంక్‌ ఖాతా నుంచి జరిగిన అన్ని లావాదేవీలను పరిశీలించిన పోలీసులు ఒకటే అకౌంట్‌కి డబ్బులు వెళ్లినట్టు గుర్తించారు. అనుమానంతో ఆరా తీయగా ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఆటో డెబిట్ ఆప్షన్‌ను ఎంచుకోవటం వల్ల ఎప్పటికప్పుడు డబ్బులు అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోయానట్టు పోలీసులు వెల్లడించారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చిన సమయంలో  వారిపై నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. పేరెంటింగ్ కంట్రోల్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసుకున్నాకే పిల్లలకు ఫోన్‌లు ఇవ్వాలని సైబర్ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఇలా లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకోక తప్పదు.