Bandi Sanjay On Kavitha : మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ - అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా బీజేపీ బలపర్చిన  అభ్యర్థి అయిన ఏవీఎస్ రెడ్డిని గెలిపించాలని బండి సంజయ్ కోరారు.  ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.
 
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 1వ తేదీనే జీతాలు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు. నెలరోజుల్లోనే పెండింగ్ డీఏలన్నీ చెల్లిస్తామన్నారు. పీఆర్సీని నియమిస్తామన్నారు. అలాగే 317జీవోను సవరిస్తామని బండి సంజయ్ అన్నారు. ఓటేసే ముందు టీచర్లు ఒక్క క్షణం ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సత్తా చూపాలన్నారు. మీ ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతోందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కావని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇతర ఎన్నికలు లేవన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో పేదలు పడుతున్న బాధలను గుర్తు చేసుకుని ఓటేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చేవారని, సీఎం కేసీఆర్ మాత్రం ఏ మాట ఇచ్చినా అంతే సంగతులన్నారు. పంజాబ్ కు చెక్కులు పంచితే చెల్లలేదన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇయ్యలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. జీతాలు ఇయ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచి చూపించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 


ఒక్కో ఓటుకు రూ.20 వేలు! 


మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఏఎమ్ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్యర్యంలో బీజేపీ టీచర్స్ MLC అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉపాధ్యాయ, అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోహన్ రెడ్డి హాజరయ్యారు. కేబినెట్ లో పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అప్పులన్నీ తీరాలంటేనే బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ లేకుంటే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిచ్చే పరిస్థితి ఉందన్నారు. ఒక్కో ఉపాధ్యాయ సంఘానికి రూ. 5 కోట్లు ఇచ్చి... ఓట్లను కొనేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తూ టీచర్ల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున మూడోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయం అని వ్యాఖ్యానించారు. దళితబంధు, పేదలకు గృహ నిర్మాణాలకు డబ్బులు ఎక్కడి నుంచి కేసీఆర్ తీసుకొస్తారని ప్రశ్నించారు. కేబినెట్ భేటీలో టీచర్ల సమస్యల గురించి కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. 


నాపై ఇంటెలిజెన్స్ నిఘా 


"కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు. కవిత తలపెట్టిన దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారు. నా పై రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సిబ్బందితో నిఘా పెట్టింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇతరులకు వస్తే ఎందుకు స్పందించలేదు. మైనర్ బాలికలపై అత్యాచారం, మహిళలపై బీఆర్ఎస్ నేతల వేధింపులు. మహిళల రవాణాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా సర్పంచ్, ఆ పార్టీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేశారు. మహిళను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారో పేపర్ చూస్తే తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలే మహిళలను కించపరుస్తున్నారు. కవిత ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి. దిల్లీలో కాదు తెలంగాణలో మహిళలపై వేధింపులపై పోరాడాలి " - బండి సంజయ్