Kompella Madhavi Latha Virinchi Hospitals Chairperson: హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా (BJP Candidates 1st List)ను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేత వినోద్ తావడే, అర్జున్ పాండేతో కలిసి పలు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగానూ 9 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో శుక్రవారం బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ పేరు ఉండటం విశేషం. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై పార్టీ మరోసారి నమ్మకం ఉంచింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు అదే స్థానం నుంచి బరిలో నిలుపుతోంది బీజేపీ.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల తరువాత ఓ పేరు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఫోకస్ చేస్తోన్న బీజేపీ.. అక్కడి నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై ఓ మహిళను బరిలో నిలుపుతున్నారు. డాక్టర్ మాధవి లత (Madhavi Latha)ను హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించి, ఎంఐఎం కంచుకోటను బద్ధలుకొట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఓ అగ్రనేతను కాకుండా మహిళా నేత మాధవి లతకు హైదరాబాద్ స్థానం నుంచి ఛాన్స్ ఇవ్వడంతో ఎవరీమే అని చర్చ జరుగుతోంది.
ఎవరీ మాధవీ లత..
కొంపెల్ల మాధవీ లత కోఠిలోని మహిళా కళాశాల (Koti Womens College)లో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. డాక్టర్ కొంపెల్ల మాధవీ లత విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. తన పిల్లలకు హోమ్‌స్కూల్‌కు ఎంచుకున్నట్లు ఆమె చెబుతుండేవారు. ఆమె లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దాంతోపాటు మాధవీ లత లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్‌లోని తన లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో పలు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా హింధూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలో ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అసదుద్దీన్‌కు చెక్ పెడతారా?
ఎన్ఎసీసీ క్యాడెట్‌గా, క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రధాని మోదీ నాయకత్వం, బీజేపీ విధానాలకు ఆకర్షితురాలై మాధవీ లత బీజేపీలో చేరారు. పాతబస్తీలో ఏమైనా సమస్యలు వస్తే, వాటికి పరిష్కారం చూపించేవారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చేవారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. గతంలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు రెండో స్థానంలో నిలిచారు కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
1984 నుంచి ఒవైసీల అడ్డా హైదరాబాద్..
తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. 2009, 2014, 2019 నాలుగు వరుస లోక్ సభ ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. అసదుద్దీన్ కు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు రెండు దశాబ్దాలపాటు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. అంటే హైదరాబాద్ సీటు 1984 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీల అడ్డా. ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి, విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవీ లతకు ఛాన్స్ ఇచ్చింది. ఎంతో ఆస్తి ఉన్నా సాధారణ జీవితమే తనకు ఇష్టమని చెప్పే మాధవీ లత ఆధ్యాత్మిక విషయాలు, సంస్కృతి, సాంప్రదాయాలపై తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అసదుద్దీన్ పైనే పోటీకి నిలపడంతో మాధవీ లత మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.