Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీల బంద్ కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు డ్రైవర్లు బంద్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ భారీ జరిమానాలు విధిస్తున్నారని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల జేఏసీ ఆరోపిస్తుంది. నూతన మోటార్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు బంద్ చేస్తు్న్నారు. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల యూనియన్ జేఏసీ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. వాహనాల ఫిట్‌నెస్, లేట్ ఫీజు పేరుతో రోజుకు రూ.50 వసూలు చేయడంపై జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంధన, గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది జేఏసీ. ఖైరతాబాద్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ భవన్ వరకు డ్రైవర్ల యూనియన్ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని పేర్కొంది.
భారీ జరిమానాలు సరికాదు
కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని డ్రైవర్లు అంటున్నారు. పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటున్న సమయంలో ప్రభుత్వం జరిమానాల పేరిట వేధించడం సరికాదన్నారు. వాహన ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఈఎంఐలు విపరీతంగా పెరిగి, వాహనాలు నడపడమే కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ కార్మికుల నడ్డివిరుస్తోందని ఆరోపిస్తున్నారు. ఫిట్‌నెస్, లేట్ ఫీజ్ పేరుతో రోజుకు ఒక్కో వాహనంపై రూ. 50 జరిమానా విధించడం సరికాదని అంటున్నారు. ఈ జరిమానాలు ఆన్‌లైన్‌లో పెండింగ్ చలాన్ల రూపంలో వేలాది రూపాయలు పెండింగ్ ఉన్నట్లు చూపించడం దారుణమని డ్రైవర్లు అంటున్నారు. కిరాయికి వాహనాలు తిప్పుకునే డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో డైలీ కూలీ కూడా రావడంలేదని వాపోతున్నారు. ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఈఎంఐలతో వాహనాలు నడపలేని స్థితిలో ఉన్నారంటున్నారు.
మోటార్ వాహన చట్టం రద్దు చేయాలి
కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి అప్పులు పాలయ్యామని ప్రైవేట్ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ప్రభుత్వం ఇలా ఫైన్‌లు, కొత్త చట్టాల అమలు చేస్తూ డబ్బులు వసూలు చేయడం సరికాదని అంటున్నారు. రోజు రోజుకు నిత్యవసర సరుకుల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఆటో, క్యాబ్‌ల మీటర్ ఛార్జీలు మాత్రం అందుకు అనుగుణంగా పెంచలేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను అర్ధం చేసుకొని కొత్త మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ఫిట్‌నెస్ లేట్ ఫీజ్ ఛార్జీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని జేఏసీ కోరుతున్నారు.