Guntur News : గుంటూరు జిల్లాలో వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలను పోలీసులు అరెస్టు చేశారు. గుజ‌రాత్ రాష్ట్రం నుంచి తెనాలి వ‌చ్చిన ప‌లువురు యువ‌తులు ప్రధాన ప్రాంతాల్లో మ‌కాం వేసి బ‌ల‌వంత‌పు న‌గ‌దు వ‌సూళ్లకు పాల్పడ్డారు. బుధ‌వారం తెనాలి నుంచి అంగ‌ల‌కుదురు వెళ్లే మార్గంలో వాహ‌నాలు ఆపి వారి వ‌ద్ద ఉన్న ఏవో కాగితాలు చూపిస్తూ న‌గ‌దు ఇవ్వాలంటూ ప‌ట్టుప‌ట్టారు. సుమారు ఐదు నుంచి ఆరుగురితో కూడిన బృందంలోని యువ‌తులు జీన్స్ ప్యాంట్‌, ష‌ర్ట్ ధ‌రించి అటుగా వెళుత‌న్న టూ వీల‌ర్స్‌, కార్లను అడ్డగించి న‌గ‌దు వ‌సూళ్లకు పాల్పడుతుండటంతో ప‌లువురు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యారు. ఓ యువ‌తి ప‌సి బిడ్డను ఎత్తుకుని మండుటెండ‌లో న‌గ‌దు వ‌సూళ్లు చేస్తూ క‌నిపించింది. హిందీ భాష‌లో మాట్లాడుతున్న యువ‌తులు న‌గ‌దు ఇవ్వని వాహ‌నాల వెంట‌ప‌డి మ‌రీ డిమాండ్ చేసి డ‌బ్బులు వ‌సూలు చేశారు. 


లాడ్జిలో మకాం వేసి 


వీరంతా రెండు రోజులుగా తెనాలి ప‌రిస‌ర ప్రాంతాల్లో మ‌కాం వేసి న‌గ‌దు వ‌సూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అదే విధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ యువ‌తులు ఇదే మాదిరిగా హ‌ల్‌చ‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ ప్లాజా లాడ్జిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన 32 మంది మ‌హిళ‌లు, యువ‌తులు గత ఐదు రోజులుగా మ‌కాం వేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బృందాలుగా విడిపోయి గుంటూరు టౌన్, హైవేలలో, ఇత‌ర ప‌ట్టణాల‌లో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వెహికల్స్ ఆపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో వీరి క‌ద‌లిక‌లపై ఆరాతీసిన పోలీసులు వీరు లాడ్జిలో మ‌కాం వేసి ప‌గ‌టి పూట ఈ విధంగా వ‌సూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 


గుజరాత్ ముఠా 


గుంటూరు జిల్లాలో వాహనదారులను నుంచి డబ్బు గుంజుతున్న గుజరాత్‌ మహిళల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేశ్‌బాబు మీడియాకు తెలిపారు. గుజరాత్‌లోని దుర్గానగర్‌కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపి నగదు వసూలు చేస్తున్నారు. తమది గుజరాత్‌ అని ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ పేపర్లు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాహనదారుల నుంచి వాహనాల తాళాలు లాక్కొని వారిని ఇబ్బందిపెడుతున్నారు. డబ్బు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతామని కొందరు మహిళలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు యువతులను అరెస్టు చేశామన్నారు.