Rahul Gandhi Telangana Tour : తెలంగాణలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించింది. అండగా ఉంటామని ఎన్‌ఎస్‌యూఐ నేతలకు రాహుల్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. 


రాహుల్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే రాహుల్ సభతో పాటు ఎలాంటి సభలను ఓయూలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేమని ఓయూ వీసీ, ఓయూ కమిటీ నిర్ణయం స్పష్టం చేసింది. దాంతో  ఓయూ విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. కొందరు ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానిక కోర్టు ఆదేశాలతో వారిని జైలుకు తరలించారు. 



భారీ బందోబస్తు 


ఎన్‌ఎస్‌యూఐ నేతల ములాఖత్ కు ముందుగా రాహుల్‌గాంధీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్‌ నేతలు జైలు అధికారులను కోరిన మీదట శనివారం ఉదయం అనుమతి లభించింది. రాహుల్‌ గాంధీతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలుకు వచ్చినప్పుడు పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాహుల్‌ గాంధీ ములాఖత్‌ ముగిసే వరకూ జైలులో సాధారణ ములాఖత్‌లను అధికారులు నిలిపివేశారు.రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలులో ములాఖత్ కు వచ్చిన సందర్భంగా జైలు వద్దకు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా చేరుకున్నారు. 



తెలంగాణ ఉద్యమకారులతో భేటీ 


అంతకు ముందు దామోదరం సంజీవయ్య 50వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ సంజీవయ్య పార్క్ లో సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో సంజీవయ్య పార్క్ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు తమ వాహనాలు అనుమతించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో రెండో రోజు పలువురితో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం అయ్యారు. గద్దర్‌, హరగోపాల్‌, చెరుకు సుధాకర్‌, కంచె ఐలయ్యతో విడివిడిగా రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు రాహుల్ తెలుసుకున్నారు. అనంతరం తాజ్‌కృష్ణ హోటల్‌ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లారు.