Telagana CM Revanth 20 Days Rule: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు అవుతోంది. డిసెంబర్‌ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాగా... 7వ తేదీ  మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతోపాటు 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆరోజు సాయంత్రమే మొదటి కేబినెట్‌ మీటింగ్‌  కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. సీఎంగా రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏయే కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పాతిక రోజుల పాలన గురించి ప్రజలు  ఏమనుకుంటున్నారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌.. బెస్ట్‌ ఇంప్రెషన్‌ అంటారు అందరూ. మరి... రేవంత్‌రెడ్డి ప్రభుత్వం... ఫస్ట్‌ ఇంప్రెషన్‌ కొట్టేసిందా..? ప్రజలు నుంచి బెస్ట్‌  అనిపించుకుంటోందా..?


ఎన్నికల ముందు ఐక్యతా రాగం వినిపించిన రేవంత్‌రెడ్డి... పార్టీలోని నేతలందరినీ కలుపుకుని... కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడ్డారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం  కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా... ఇటు పార్టీ సీనియర్లు, అటు ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుని వెళ్తున్నారు.  ఎక్కడా అహంకారం, అహంభావం అన్నది లేకుండా... పాలన చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పాతిక రోజుల్లో ఆచితూచి... స్థిరంగా పాలన చేస్తున్నారని  అంటున్నారు. ప్రధాని మోడీని కూడా కలిసి.... కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండేలా ప్రయత్నించారు. పార్టీలు ఏదైనా... రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో.. ప్రధానిని  కలిసి... రాష్ట్ర పరిస్థితిని.... రావాల్సిన పనులను విన్నవించుకోవడం మంచి పరిణామని భావిస్తున్నారు.


ఇక... ప్రమాణ  స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఉత్తర్వులపై సంతకం చేశారు రేవంత్‌రెడ్డి. అలాగే వికలాంగురాలు అయిన రజినీకి ఉపాధి  కల్పించారు. ప్రగతిభవన్‌ పేరును... బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మార్చారు. అక్కడా వారాని రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ.. ప్రజాసమస్యలపై  దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో రోజుకో మంత్రి హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.


అధికారంలోకి వచ్చిన మూడో రోజే... అంటే డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా.. ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్‌రెడ్డి  సర్కార్‌. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తోంది. అలాగే... రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షల వరకు పెంచారు. మిగిలిన గ్యారెంటీలను  కూడా వంద రోజుల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ఇప్పటికే.. ఒక దరఖాస్తు ఫారమ్‌ కూడా విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో గ్రామ, వార్డు సభలు  నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, 500 రూపాయలకే గ్యాస్‌.. ఇలా ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తులు  స్వీకరిస్తున్నారు. జనవరి 6వ తేదీ వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దీంతో ప్రజాపాలనకు ప్రజలు క్యూకడుతున్నారు.


రాజకీయాల విషయానికి వస్తే... బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని దుయ్యబడుతోంది రేవంత్‌రెడ్డి సర్కార్‌. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని అసెంబ్లీ వేదికగా   ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, అప్పుల గణాంకాలతో కూడిన శ్వేత పత్రాన్ని రాష్ట్ర సర్కారు విడుదల చేసింది. 2014లో రాష్ట్రం  ఏర్పడినప్పుడు రుణభారం కేవలం 14 శాతం ఉంటే ఇప్పుడు రుణభారం 34 శాతానికి పోయిందన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా ఆస్తుల సృష్టి జరగలేదన్నారు. అప్పులు  మాత్రం భారీగా పెరిగాయని విమర్శించింది. అలాగే... విద్యుత్‌ రంగంపై కూడా శ్వేతపత్రం విడుదల చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా  ప్రమాదకరంగా ఉంది. డిస్కంలు రూ.81వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది.  బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవకతవకలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టింది. 


మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిన విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంది రేవంత్‌రెడ్డి సర్కార్‌. నిన్న.. (డిసెంబర్‌ 29)న మంత్రుల బృందం మేడారం, అన్నారం బ్యారేజ్‌లను  పరిశీలించారు. అంతా నాశిరకం పనులే అని... 93వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని తేల్చారు. బ్యారేజ్‌ డిజైన్‌, నిర్మాణం తుగ్లక్‌ చర్య అని మండిపడ్డారు. నాసిరకం  బ్యారేజీలు కట్టేబదులు... రాజీనామా చేసి వెళ్లిపోయి ఉండాల్సిందని ఈఎన్సీతోపాటు ఇంజనీర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు. కాళేశ్వరంలో జరిగిన  అవకతవకలపై... జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేస్తామని... గత ప్రభుత్వంలోని వారు, అధికారులు కూడా ఇందులో బాధ్యులే అని... అందరూ జైలుకు వెళ్లక తప్పదని  హెచ్చరించారు.


ఇదిలా ఉంటే... రైతుబంధులు నిధులు, రైతులకు ధాన్యంపై ఇస్తామన్న బోనస్‌ ఇంకా ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అప్పుడే రేవంత్‌రెడ్డి సర్కార్‌  పనైపోయిందని... డిసెంబర్‌ 9న తేదీనే అమలు చేస్తామన్న హామీలను... అధికారంలోకి వచ్చి పాతిక రోజులు అవుతున్నా అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు.  అంతేకాదు... ప్రస్తుతం ఉన్న లబ్దిదారులకు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా... కొత్తగా దరఖాస్తు విధానం ఏందుకని, దీని వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని  క్వశ్చన్‌ చేస్తున్నారు. 


మొత్తంగా... ఇది రేవంత్‌రెడ్డి పాతిక రోజుల పాలన. కొన్ని తప్పులు ఉన్నా.... స్థిరంగా పాలన సాగుతోందని చెప్తున్నారు పొలిటికల్‌ అనలిస్టులు. అసెంబ్లీలో గట్టిగా వాయిస్‌ వినిస్తూ...గత పాలనకుల అవినీతిని ఎండగడుతూ...ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు సమయం ఇస్తూ... అహంభావం అనేది లేకుండా అందరినీ కలుపుకుని పోతూ...  రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.