New Year Resolution Ideas : న్యూ ఇయర్​ అంటే క్యాలెండర్ మారడమే కాదు.. మనలో కూడా ఏదో మార్పు రావాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉంటారు. దానిలో భాగంగానే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ (New Year Resolutions 2024) తీసుకుంటారు. కొందరు వాటిని కచ్చితంగా ఫాలో అవుతారు. మరికొందరు వాటిని పాటించడానికి ట్రై చేస్తారు. మరికొందరు పూర్తిగా విస్మరిస్తారు. అయితే 2024 అలా కాకూడదు.. కచ్చితంగా ఈ సంవత్సరం మంచి రెజల్యూష్యన్ తీసుకోవాలి.. వాటిని పాటించాలనుకుంటే ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. ఇవి మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా మంచి చేస్తాయి. పైగా సింపుల్​గా ఫాలో అయ్యే టిప్స్ ఇవి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


పనివాయిదా వేయడం మానుకోండి..


చాలామంది పనులు వాయిదా వేస్తారు. దానికి వివిధ కారణాలు చెప్తారు. అలా ఆపేసిన పనులన్ని కలిసి మీపై అధిక ఒత్తిడిని అందిస్తాయి. కాబట్టి సమయాన్ని వృథా చేసే అంశాలకు దూరంగా ఉంటూ నిర్వహించాల్సిన పనిపై దృష్టి పెట్టండి. మొత్తంగా కాకపోయినా కొంచెం కొంచెంగా అయినా గడువులోపు దానిని పూర్తి చేయండి. అది కేవలం ఆఫీస్ విషయాలే అవ్వనవసరం లేదు. ఉదాహరణకు మీరు ఓ బుక్ చదవాలనుకుంటే.. కనీసం రోజుకో పేజీ అయినా చదివేలా ప్లాన్ చేసుకోవాలి అనమాట. ఒకరోజు ఎక్కువ చదివేశామని రెండో రోజు వద్దులే.. అన్ని ఒకేసారి చదివేద్దాం అనుకోకూడదు. కొంచెం చదివినా.. రోజూ దానిని కంటిన్యూ చేయడం ముఖ్యం అనమాట. ఇది మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలా విషయాల్లో మీరు చురుగ్గా ఉండేలా చేస్తుంది. 


రోజులో కొంచెం గ్యాప్ తీసుకోండి..


కొందరు ఎక్కువగా చెప్పేది ఏమిటంటే.. అస్సలు ఈరోజు ఊపిరి తీసుకోవడానికి కూడా గ్యాప్ దొరకలేదు. చాలా కష్టపడిపోయాను అంటారు. అంత అవసరం లేదు. కష్టపడటాన్ని ఆపమనటం లేదు. ఎంత బిజీగా ఉన్నా.. రెండు మూడు గంటలకు ఓ సారి చిన్న బ్రేక్ తీసుకోండి. ఓ పది నిమిషాలు ఫోన్ కూడా చూడకుండా నచ్చినవారు దగ్గర ఉంటే వారితో మాట్లాడండి. లేదంటే ఎక్కడైనా కూర్చోని బ్రీత్ ఎక్సర్​సైజ్​లు చేయండి. ఇది మీకు ఒత్తిడి నుంచి రిలాక్స్ ఇస్తుంది. లేదు మాకు బ్రేక్ తీసుకోవడం కుదరదు అంటే.. రోజులో ఓ అరగంట మీకు మీరు కేటాయించుకోండి. పార్క్​లోకి వెళ్లండి. లేదంటే ఒంటరిగా కూర్చోండి. నచ్చిన విషయాలు గురించి ఆలోచించండి. పని గురించి కాకుండా ఇంక దేని గురించైనా మీకు పాజిటివ్​ ఇచ్చే విషయాలు గురించి థింక్ చేయండి. ఇవి మీరు రీఛార్జ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి.


ఎందుకు తింటున్నారు?


మనం కష్టపడేది కడుపు నిండా తినడం కోసమే. అయితే కొందరు ఏమి తింటున్నారో? ఎందుకు తింటున్నారో తెలియకుండా తినేస్తారు. అది హెల్త్​కి మంచిదా చెడ్డదా అని ఆలోచించరు. ఆ సమయానికి ఆకలికి కడుపు నిండిపోయిందా అని చూస్తారు. మన శరీరంలోకి పంపించే ఆహారం మనకి ఎంతవరకు మంచిదని ఆలోచించడంలో ఎలాంటి తప్పులేదు. పైగా అనవసరమైనవి ఎక్కువగా తింటే హెల్త్ కరాబ్ అవుతుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. శరీరం ఏమి డస్ట్ బిన్​ కాదు. ఏది పడితే అది లోపల వేసేయడానికి. ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొత్త వాటిని ట్రై చేయడంలో తప్పులేదు కానీ.. అదే పనిగా అనారోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది మీకు కచ్చితంగా హెల్ప్​ చేసే రిజల్యూషన్ అవుతుంది.


ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..


డబ్బులు ఇంపార్టెంట్. అస్సలు కాదు అనట్లేదు కానీ.. డబ్బు కన్నా ఆరోగ్యం చాలా విలువైనది. డబ్బులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మీరు ఎంత సంపాదించినా వేస్ట్​నే. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించండి. ఏమి తింటున్నారు? ఎంత వర్క్ చేస్తున్నారు? ఎంత సేపు నిద్రపోతున్నారు? రోజులో మీ ఆరోగ్యం కోసం మీరు ఏమి చేస్తున్నారు వంటి విషయాలపై కచ్చితంగా శ్రద్ధ తీసుకోండి. ఇది మీకు మీరు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. 


మిమ్మల్ని మీరు క్షమించుకోండి..


తప్పు చేయని వారు ఎవరూ ఉండరు. తెలిసో.. తెలియకో ఎవరో ఒకరు ఏదొక సమయంలో తప్పు చేస్తారు. అలాంటి తప్పు మీ వల్ల జరిగిందనుకో మిమ్మల్ని మీరు ఊరికే నిందించుకోకండి. మరోసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడండి. అంతేకానీ మీరు అపరాధభావంతో ఇబ్బంది పడుతూ ఉంటే.. మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్షమాపణ చెప్పగలిగే వారికి.. హృదయపూర్వకంగా సారీ చెప్పండి. వారు క్షమించకపోయినా మరోసారి ప్రయత్నించండి. ఇంకా వారు మారలేదంటే అక్కడి నుంచి మీరు వెళ్లిపోండి. ఏదొక రోజు వారే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆ గ్యాప్​లో మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. మీరు హ్యాపీగా ఉండడానికి పూర్తిగా డిజర్వ్ అని తెలుసుకోండి. 


టాక్సిక్ పర్సన్స్​కి బాయ్ చెప్పండి..


మన లైఫ్​లో పాజిటివ్​ ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ.. టాక్సిక్​గా ఉండేవారు చుట్టూనే ఉంటారు. మీకు నెగిటివిటీ ఇచ్చేవారికి మీరు వీలైనంత దూరంగా ఉండండి. అంతేకాకుండా మిమ్మల్ని చూసి కుళ్లుకునేవారిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి. వీలైనంత పాజిటివ్​గా ఉండేవారితోనే టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని వెనక్కి లాగేవారితో, మీకు చెడు ఆలోచనలు ఇచ్చేవారిని మీ లైఫ్​లోకి రాకుండా చూసుకోవడమే మంచిది. 


జిమ్​కే వెళ్లాలా ఏంటి?


న్యూ ఇయర్​ అంటే జిమ్​కి డబ్బులు కట్టేసి తర్వాత మానేయడం కాదు. చాలామంది న్యూ ఇయర్​కి చేసే మొదటి పని ఇది. కానీ మీరు నిజంగా హెల్తీగా ఉండాలంటే జిమ్​కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గొచ్చు. హెల్తీగా, ఫిట్​గా ఉండొచ్చు. రోజులో ఎంతో కొంత సమయం మీరు తేలికపాటి వ్యాయామలు చేయండి. నిద్ర లేచిన వెంటనే బాడీ స్ట్రెచ్ చేయండి. ఎండలో కాసేపు నిలబడండి. కుదిరితే వాకింగ్ చేయండి. కానీ ఏది చేసినా.. రోజూ దానిని కంటిన్యూ చేయండి. కచ్చితంగా మీలో ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. 


ఒత్తిడి తగ్గించుకోండి..


మానసికంగా, శారీరకంగా కృంగదీయడంలో ఒత్తిడి ముందు ఉంటుంది. దీనిని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం. అనవసరమైన విషయాలకు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి. కొన్ని విషయాలు మనం ఎంత చేసినా అవి మన కంట్రోల్​లో ఉండవు. అలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉన్న సమయాన్ని హాయిగా, ప్రశాంతంగా గడిపేయండి. 


డబ్బులు ఆదా..


ఇది ప్రతి సంవత్సరం అందరికీ ఉండే రిజల్యూషన్​లో ఒకటి. జీవితాన్ని ప్రేమ, అనురాగం, ఆప్యాతలే ముందుకు నడిపిస్తాయి అంటారు. అయితే వీటన్నింటిని రూల్ చేసేదే డబ్బు. ఇది ఉంటేనే అన్ని మనకు వస్తాయి. డబ్బుతో పనేమి ఉందని కొందరు అంటారు కానీ.. ఇదే అన్నింటిని నడిపిస్తుంది. కాబట్టి మీ దగ్గరున్న డబ్బులో మీ ఖర్చులకు పోగా.. ఓ పదిశాతం డబ్బునైనా పక్కకు పెట్టడం నేర్చుకోండి. దానిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీయకండి. ఇలా కొన్నాళ్లు జమ చేసిన సొమ్మును మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఫుడ్ బయట ఆర్డర్ చేయడం తగ్గించండి. అనవసరంగా బట్టలు కొనడం ఆపండి. బతకడానికి మరీ పిసినారిగా ఉండమని కాదు.. కాస్త పొదుపుగా ఉండడం నేర్చుకోండి. అనవసరమైన చోటు డబ్బు ఖర్చు చేయకండి. అవసరమైన చోట డబ్బు ఖర్చు పెట్టే ముందు ఓసారి ఆలోచించండి. 


రిలేషన్స్.. 


ఏ రిలేషన్​కి అయినా బౌండరీలు పెట్టుకోండి. ఇది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడకుండా చేస్తుంది. ఓ వ్యక్తి మీ లైఫ్​లోకి రావాలన్నా.. మీరు ఇతరుల లైఫ్​లోకి వెళ్లాలన్నా.. ఈ బౌండరీలు కచ్చితంగా ఉండాలి. ఇది వ్యక్తిగత జీవితాలకు, పర్సనల్​ స్పేస్​కు చాలా అవసరం. రిలేషన్​లో ఉన్నాక పర్సన్ స్పేస్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఇది ఏ రిలేషన్​కి అయినా అవసరం. లేదంటే ఇతరవ్యక్తులు మీకు ఇబ్బందిగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి రిలేషన్​లో కాస్త సెన్సబుల్​గా ఉంటూనే బౌండరీలు పెట్టుకోవడం మంచిది. 


ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. ఇవి మానసికంగా, శారీరకంగా కూడా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాయి. పెద్ద పెద్ద మార్పులే చేయాల్సిన అవసరం లేదు.. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. కాబట్టి హ్యాపీగా వీటిని ఫాలో అయిపోతే కొత్త సంవత్సరంలో మీరు కొత్తగా ఏదైనా చేసేందుకు వీలు ఉంటుంది. 


Also Read : అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ కోసం మీ చర్మాన్ని, జుట్టుని సిద్ధం చేసుకోండిలా