Telangana Elections Counting News: తెలంగాణ లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఫలితాలపై అందరూ అమితమైన ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఫలితాలపై తార స్థాయిలో ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు, కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ఎలా చేస్తారనే అనుమానం చాలా మందిలోనూ ఉంటుంది. ఈవీఎంలను తెరవడం నుంచి.. ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటించే వరకు ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపై హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని కౌంటింగ్ కేంద్రానికి రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న మహిపాల్ కీలక వివరాలు ఏబీపీ దేశంకు వివరించారు.
గంట ముందు స్ట్రాంగ్ రూంలు ఓపెన్
‘‘ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గంట ముందు తెరుస్తాం. అభ్యర్థుల ముందే వీడియోగ్రఫీ ద్వారా స్ట్రాంగ్ రూంలు తెరుస్తారు. సీల్ కూడా వారి ముందే వేస్తారు. ఒకవేళ ఈవీఎంలకు వేసిన సీల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు.
ఏజెంట్లకు గంట ముందే అనుమతి
ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఒక్కో టేబుల్ దగ్గర అభ్యర్థికి చెందిన ఏజెంట్ పెట్టుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. ఏజెంట్ గా పెట్టాలనుకునే వ్యక్తి కోసం ఫాం - 18 ద్వారా అప్లికేషన్ పెట్టించి, దాన్ని పోలీస్ వెరిఫికేషన్ చేయిస్తారు. కేసులు ఏం లేకుండా క్లీన్ చిట్ ఉన్నవారికి మాత్రమే ఐడీ కార్డులు జారీ చేస్తాం. వారిని ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయమని చెప్పి.. 7 గంటలకల్లా లోనికి అనుమతిస్తాం. 8 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.
ప్రతి టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ముగ్గురు అధికారులు ఉంటారు. అసిస్టెంట్, సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలను ఆ ఏజెంట్లకు చూపించుకుంటూ అన్ని రికార్డు చేస్తారు. ఈ కౌంటింగ్ ప్రాసెస్‌లో ఏజెంట్స్ ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే సిబ్బంది రిటర్నింగ్ ఆఫీసర్‌కు లేదా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కు సమాచారం ఇస్తారు. మేం జోక్యం చేసుకొని వారికి వివరణ ఇస్తాం.
కౌంటింగ్ హాల్ లో 14 టేబుల్స్ ఉంటాయి. వివిధ పోలింగ్ స్టేషన్ లను ఒక టేబుల్ కు కేటాయిస్తారు. ఫస్ట్ రౌండ్ లో 14 పీఎస్‌లు ఉంటాయి. 1 నుంచి 14 పీఎస్‌లు మొదటి రౌండ్ లో ఉంటాయి. రెండో రౌండ్ లో 15 నుంచి 28 పీఎస్‌లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌కు 14 పీఎస్ ల చొప్పున కౌంట్ అవుతాయి. చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 305 పీఎస్‌లు ఉన్నాయి. దాన్ని బట్టి, ఒక్కో రౌండ్‌కు 14 పీఎస్‌లు అంటే.. 22 రౌండ్లలో మొత్తం కౌంటింగ్ పూర్తవుతుంది.
కౌంటింగ్ వేళ ఏజెంట్స్ అభ్యంతరం తెలిపితే?
కౌంటింగ్ సమయంలో రిజల్ట్ బటన్ నొక్కగానే ఈవీఎంలో ఏ క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్లు వచ్చాయో క్లియర్ గా చూపిస్తుంది. టేబుల్ అసిస్టెంట్ ఏజెంట్స్ కి చూపిస్తూనే ఉంటాడు. అదే టైంలో ఏజెంట్ లేవనెత్తిన అభ్యంతరం ఆమోదించదగిందే అయితే మళ్లీ రిజల్ట్ బటన్ నొక్కుతాం. అభ్యంతరం చేసినప్పుడల్లా రీకౌంట్ చేయడం అనేది ఉండదు. ఏజెంట్ ఆ రిజల్ట్ ను రాసుకోవడం మర్చిపోయి.. మళ్లీ రీకౌంట్ చేయాలని డిమాండ్ చేస్తే దాన్ని అంగీకరించం.
వీవీప్యాట్‌లను కేవలం ర్యాండమ్‌గా 5 పీఎస్‌లు మాత్రమే కౌంట్ చేస్తారు. అందులోని స్లిప్‌లు, ఈవీఎంలలోని రిజల్ట్ వందశాతం టాల్లీ అవుతుంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని అభ్యర్థి తరపున వచ్చిన ఏజెంట్లు పర్యవేక్షిస్తూనే ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద అభ్యర్థి లేదా ఏజెంట్ ఉండి చూస్తూనే ఉంటారు.
ఒక రౌండ్ లెక్కింపు పూర్తి కాగానే ప్రతి టేబుల్ వద్ద ఉండే అబ్జర్వర్, ఆ తర్వాత మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తుంటారు. అబ్జర్వర్ సంతకం చేశాక ప్రతి రౌండ్ సమాచారం బయట మీడియాకు తెలపడం జరుగుతుంది’’ అని రిటర్నింగ్ ఆఫీసర్ మహిపాల్ వెల్లడించారు.