Telangana Home Minister :  రాజకీయ నేతలకు కోపం వచ్చినా నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ లో అయితే ఎంత  విసుగు వచ్చిన ముఖం మీద చిరునవ్వు చెదరనీయరు. కానీ కొంత మందికి షార్ట్ టెంపర్ ఉంటుంది. వారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. అందుకే వివాదాల్లోకి వస్తూంటారు. కానీ ఈ రెండింటికి అతీతంగా.. .తాను అసలు హోంమంత్రినేనా కాదా అన్నట్లుగా అంటీ ముట్టనట్లుగా ఉండే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కోపం వచ్చింది. అది కూడా పెద్ద విషయానికి కాదు. దీంతో ఆయన ఒక్క సారిగా వైరల్ అయిపోయారు. 


సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఇంటికి వెళ్లారు.  ఈ సందర్భంగా తలసానిని ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. తర్వాత తాను చెచ్చిన ఫ్లవర్ బోకే ఇద్దామనుకుకున్నారు. ఆ బోకే తనతో పాటు సెక్యూరిటీగా ఉండే వ్యక్తి దగ్గర లేదు. దాంతో దగ్గరకు పిలిచి  లాగి లెంపకాయ కొట్టారు. ఏం జరిగిందో అర్థం కానీ ఆ సెక్యూరిటీ పర్సనల్ తేరుకుని..  హోంమంత్రి వైపు సీరియస్ గా చూశారు. అప్పుడు బోకే అని అడగడంతో..  వెనుక ఉన్న హోంమంత్రి పీఏ పూల బోకేను తెచ్చి ఇచ్చారు. అది తలసానికి ఇచ్చి నవ్వులు చిందించారు మహమూద్ అలీ. 


అయితే అకారణంగా.. సెక్యూరిటీ సిబ్బందిని హోంమంత్రి కొట్టడం వీడియోల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా తనకు సెక్యూరిటీగా ఉండే అంగరక్షకుడిపై హోంమంత్రి చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వారి భద్రతను పర్యవేక్షిస్తారే  కానీ బోకేలు మోయడం.. మంచి నీళ్లు అందించడం వంటి పనులు చేయరని అంటున్నారు. అయితే ఆ పోలీసు కూడా ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదమో కానీ.. హోంమంత్రి రక్షణ గురించే పట్టించుకుంటున్నారు. బోకేల గురించి పట్టించుకోలేదు. దెబ్బ తిన్న తర్వాత బోకేను తాన చేతుల మీదుగానే హోంమంత్రికి అందించారు.                                                      


ఎలాంటి పరిస్థితుల్లోనూ అయినా ఇతరులపై చేయి చేసుకోవడం ఏ మాత్రం క్షమార్హం కాదని.. ముఖ్యంగా విధుల్లో ఉన్న పోలీసులపై వ్యక్తిగత పని చేయలేదని దాడి చేయడం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది. అయితే దాడి చేసింది హోంమంత్రి కావడం.. దెబ్బతిన్న వ్యక్తి కూడా.. పోలీసు శాఖ ఉద్యోగి కావడంతో ఎవరూ అసంతృప్తి లేదా నిరసన వ్యక్తం చేసే అవకాశం లేదు.కానీ ఈ విషయంలో హోంమంత్రి మాత్రం విమర్శలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.