Home Guard Suiside Case : హైదరాబాద్ లో ఒంటిపై కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని హత్య అని ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. రవీందర్ మరణంపై ఆయన భార్య సంధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. వారిద్దరిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తన భర్తపై నర్సింగ్‌రావు, చందు పెట్రోల్ పోసి నిప్పంటించారని, దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఎందుకు చూపించడం లేదని సంధ్య ప్రశ్నించారు. తన భర్త మృతికి కారణమైనవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త ఫోన్‌ను కొంతమంది అన్‌లాక్ చేసి డేటా డిలీట్ చేశారని ఆరోపించారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
పాతబస్తీలోని ఉప్పుగూడకు చెందిన రవీందర్.. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సమయానికి జీతాలు రావడం లేదనే మనస్తాపంతో హోంగార్డు హెడ్ ఆఫీస్ ముందు ఈ నెల 5న ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు గుర్తించి రవీందర్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కంచన్ బాగ్ అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌ను కొద్దిరోజులుగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌గా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడిన రవీందర్.. శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అయితే తన భర్తది హత్య అని ఆరోపిస్తున్నారు.
నరసింహారావు మృతితో హోంగార్డులు ఆందోళనకు దిగే ఛాన్స్ ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు హోంగార్డులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. హోంగార్డులు అందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు పోలీస్ స్టేషన్‌లో ఉండాలని సూచించారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్ పెక్టర్లు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. డ్యూటీకి రాని వారి ఉద్యోగం పోయినట్లేనని సీరియస్‌గా హెచ్చరించారు. దీంతో హోంగార్డులు నిరసనలు చేయడానికి భయపడుతున్నారు.
హోంగార్డు రవీందర్ మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ.. హోమ్ గార్డు జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. రవీందర్ మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హోం గార్డ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ పిటిషన్ దాఖలు చేశారు. కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నర్సింగరావు, కమాండెంట్ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.