TTD News: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాటేజీ దాతల సిఫారసు లేఖలపై వచ్చే వారికి గదులు కేటాయింపు ఉండదని టీటీడీ అధికారులు ప్రకటించారు. అయితే ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే వసతి గదులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఈనెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దాతలు Ttiruparibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా గదులను రిజర్వ్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 22వ తేదీన గరుడ సేవ నిర్వహించబోతున్నారు. అయితే ఈ గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కాటేజీ దాతల సిఫారసు లేఖలతో వచ్చిన వారికి ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. అలాగే అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19వ తేదీన గరుడ సేవ చేయబోతున్నారు. ఈక్రమంలోనే అక్టోబర్ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా దాతలకు గదులు కేటాయించబోమని స్పష్టం చేసింది.
ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తామని టీటీడీ అదికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కాటేజీ దాతలు గమనించి, సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విజ్ఞప్తి చేసింది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17న అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. సెప్టెంబర్ 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 17 సెప్టెంబర్ 2023 ఆదివారం రోజు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటాయి. 18వ తేదీన ధ్వజారోహణ, 19వ తేదీ మంగళవారం రోజున ఉదయం చిన శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారి ఊరేగింపు ఉంటుంది. 20వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 21 సెప్టెంబర్ 2023 గురువారం రోజున ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనంపై శ్రీవారి మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. 22వ తేదీ శుక్రవారం రోజు శ్రీవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపైన ఊరేగుతారు. 23వ తేదీ శనివారం రోజుల హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనంపైన శ్రీవారు భక్తులకు దర్శన ఇస్తారు. 24వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్ర చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. 25వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వేళ అశ్వవాహనం పై ఊరేగింపు ఉంటుంది. సెప్టెంబరు 26వ తేదీన శ్రీవారి పల్లకీ ఉత్సవం ఉంటుంది. చక్ర స్నానం, సాయంత్రం ధ్వజారోహనతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14వ తేదీన అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్టోబర్ 23వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.