తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్ సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించుకుంది. ఈ ప్లాంట్‌పై కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కోకాకోలా కంపెనీ కొత్తగా నెలకొల్పనున్న యూనిట్ కి గానూ తెలంగాణ ప్రభుత్వం 47.53 ఎకరాలు కేటాయించింది. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యాల పెంపు సహా స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు, నైపుణ్యాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో ఎంఓయూ కార్యక్రమం జరిగింది.
కోకాకోలా కంపెనీ 25 ఏళ్ల అనంతరం మరో భారీ పెట్టుబడితో రావడం మంచి పరిణామమని కేటీఆర్ ఆకాంక్షించారు. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్ధ్యాల పెంపు కోసం పని చేస్తున్న కోకాకోలా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో కూడా అధునాతన పద్దతులను పాటించాలని కేటీఆర్ సూచించారు. కోకాకోలాతో తెలంగాణ పభుత్వం మూడు ఒప్పందాలు కుదుర్చుకుందని..రానున్న రోజుల్లో ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సంస్థకు సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇండియాలో తయారైయ్యే స్థానిక ఉత్పత్తులను కేసీఆర్ ప్రోత్సాహిస్తారని జగిత్యాల నుంచి మామిడి, నల్లగొండ, సూర్యాపేట నుంచి స్వీట్ లైమ్ ను కోకాకోలా సేకరించి తమ ఉత్పత్తుల తయారీకి వినియోగించాలని సూచించారు. అలా చేయడం వల్ల రైతులకు మేలు చేసినవాళ్ళు అవుతారన్నారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇప్పటికే కోకాకోలాకు ఓ ప్లాంట్ ఉంది. ఇప్పుడు రెండో ప్లాంట్ నిర్మించబోతున్నారు. ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా సిద్దిపేట దగ్గర భారీ ప్లాంట్ పెట్టాలని కోకాకోలా నిర్ణయించడంతో ఆ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు .