టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సాక్ష్యాలు ఇవ్వడం లేదంటూ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది.కోర్టు ధిక్కరణ ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపణలు చేయగా.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని కోర్టు కు తెలిపింది. సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని హై కోర్టును కోరిందిఈడీ. తుదపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఈడీకి ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులోని నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్‌శాఖకు ఈడీ లేఖ రాసింది. అయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదు. అవన్నీ దిగువ కోర్టులో ఉన్నాయని చెప్పింది. కానీ దిగువకోర్టులో కూడా లేవని ఈడీ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు లేనందున కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
2017లో వెలుగులోకి చూసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎక్సైజ్ శాఖ 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. అయితే కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా విచారణ జరిపింది. కానీ డ్రగ్స్ కోసం సినీ తారలు ఎమైనా లావాదేవీలు నిర్వహించారో కనిపెట్టలేకపోయింది. పలువురిని విచారించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలివ్వడంతో డ్రగ్స్ కేసు మరోసారి హైలెట్ అవుతోంది. మొత్తం ఇచ్చేశామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.. ఇంకా ఇవ్వాలని ఈడీ చెబుతోంది. ఈ కేసు ముందుముందు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.