ప్రతి వినాయక చవితికి హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తూ ఉండే సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనాలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో ఆగస్టు 10వ తేదీలోపు తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. కరోనా తీవ్రత ఇంకా తగ్గిపోలేదని, ఎప్పుడైనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చని చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 


నగరంలో నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్‌లో వినాయక, దుర్గమ్మల విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది వేణు మాధవ్ 2011లోనే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ ధర్మాసనం ముందుకు మరోసారి గురువారం విచారణకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది వినాయక నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, నిమజ్జనంపై ఈ ఏడాది నిర్ణయమేంటని ధర్మాసనం అడిగింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని, అందుకు కొంత సమయం కావాలని న్యాయవాది కోరారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాల విషయంలో శాశ్వతంగా ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఏటా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి కాకుండా ఒకేసారి శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.


ఆ కేసుల కోసం రూ.58 కోట్లా..
మరోవైపు, కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు వెచ్చించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హైకోర్టుకు గురువారం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ నిధులు కోర్టు ధిక్కరణ కేసుల కోసం ఖర్చు చేయలేదని, ఆ కేసుల్లో భూ సేకరణ పరిహారం చెల్లింపు కోసం అని సీఎస్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్ ప్రసాద్‌ ధర్మాసనానికి తెలిపారు. తనకు వేసిన పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేశారని సీఎస్ ఆరోపించారు. 


అయితే, నిధులు విడుదల చేస్తూ జీవో ఉన్న తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చెబుతున్న ఉద్దేశం ఏంటి? కాగితంపై ఉన్నదేంటని ప్రశ్నించింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల్లో ఖర్చుల కోసమే జీవో జారీ చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.


Also Read: Hyderabad Viral Video: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా.. వైరల్ వీడియో