Heavy Rains in Hyderabad and Telangana | హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం తూర్పు- పశ్చిమ ద్రోణితో కలిసి అల్పపీడనంగా మారింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులవరకు తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నాలుగురోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు వాతావరణం చలికాలంలా కనిపిస్తోంది. 


ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు


ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.


హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షాలు
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్, చింతల్, ఐడిపిఎల్, సూరారం, నిజాంపేట్, గండి మైసమ్మ, సుచిత్ర, కొంపల్లి, ప్రగతి నగర్ సహా పలు ప్రాంతాలలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మునీరాబాద్, గగిల్లాపూర్, డబిల్ పూర్, గౌడపల్లిలో వాన దంచికొడుతోంది. హయత్ నగర్, అంబర్ పేట రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 






తూర్పు హైదరాబాద్ లో అధిక వర్షపాతం నమోదు కానుంది. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, రామంతపూర్, తార్నాక, అంబర్‌పేట్ వాటి పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రెండు గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌లోని పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్‌, సిరిసిల్ల, యాదాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డిలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. 


దాదాపు 3 గంటలపాటు కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి - భువనగిరి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్నిచోట్ల వర్షం పడుతుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. రాత్రి సైతం వర్షం ఇలాగే పడితే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదుకానుంది. ట్రాఫిక్ కష్టాలు తప్పాలంటే వాహనదారులు రూట్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.