High Temperatures In Telangana: తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణశాఖ చెబుతుండంతో ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో చాలా చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సాధారణ ఉష్ణో్గ్రతల కంటే గరిష్టంగా ఐదు డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్‌లో శుక్రవారం 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.1 డిగ్రీలు, నస్పూర్ 46.9, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెలపాడులో 46.9, నల్లగొండ జిల్లా కేతెపల్లిలో 46.8, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 46.8, కరెపల్లెలో 46.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచిర్యాల జిల్లా హీజీపూర్ లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ప్రధాన పట్టణాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మంలో అత్యధికంగా 45.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా నల్లగొండలో 25.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2024 వేసవి సీజన్లో అత్యంత వేడిమి రోజుగా మే 30వ తేదీ రికార్డు సృష్టించింది. మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం ఈ సీజన్లోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
వడదెబ్బకు మృత్యువాత
రాష్ట్రంలో ఎండలకు వడదెబ్బకు గురై శుక్రవారం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య (75), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన డామెర రాంబాబు (50), నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన కర్రి రాజు (40), గుర్రంపోడుకు చెందిన రేపాక ముత్తమ్మ(64), మునుగోడు మండలం ఊకొండికి చెందిన కమ్మాలపల్లి మమత (30), వడదెబ్బకు గురై మరణించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హజీపూరకు చెందిన కల్పన(24), పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్(60), కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన కళ్యాణం రామక్క (75), పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌కు చెందిన ఈదునూరి కిషోర్(34), మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన దుర్గం భీమయ్య (55), ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగోబా తండాకు చెందిన ఆత్రం లింబారావు(23) వేసవి ఉష్ణోగ్రతలకు తాళలేక వడదెబ్బకు గురై మృతి చెందారు.
నేడు, రేపు వర్షాలు
వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతవారణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, శుక్రవారం తమిళనాడు, కర్ణాటకల్లోకి ప్రవేశించినట్లు వాతావరణశాఖ తెలిపింది. శనివారం నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.