Hearing in Telangana High Court on BC Reservation GO: స్థానిక సంస్థల ఎన్నికల్లో42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. బుధవారం అటు పిటిషనర్ల తరపు లాయర్లు, ఇటు ప్రభుత్వం తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు.                 

ప్రభుత్వం  తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.  వాదనలు కొనసాగుతున్న సమయంలో.. గురువారం మరిన్ని వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో పిటిషనర్ల తరపు లాయర్లు.. గురువారమే నోటిఫికేషన్ ఇస్తారని.. హైకోర్టు నిర్ణయం వచ్చే వరకూ నోటిఫికేషన్ జారీ  చేయకుండా చూడాలని కోరారు. అయితే హైకోర్టు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం..  గురువారం ఉదయం నోటిఫికేషన్ రానుంది. అంటే  రేపటి  నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు.                               

ప్రభుత్వం తరపున వాదనలు ఇవీ : 

బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయని ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు.  జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరైంది కాదని..  ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు.  ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగిందని. 97 శాతం ఇంటింటి సర్వే జరిగింది.. బిల్లును గవర్నర్‌ ఇప్పటివరకు ఆమోదించలేదు.. తిరస్కరించలేదని అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు. రిజర్వేషన్లు  యాభై శాతం  మించకూడదనేది.. సుప్రీంకోర్టు సూచనేనని.. చట్టం కాదన్నారు. 

పిటిషనర్ల తరపు వాదనలు ఇవీ:

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే.. ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందని  పిటిషనర్‌ తరపు లాయర్ ప్రస్తావించారు. ట్రిపుల్‌టెస్ట్‌ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను గుర్తు చేశారు.  ట్రిపుల్‌ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా  కమిషన్‌ ఏర్పాటు చేయాలి.. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు తెలిపిందన్నారు.   కేవలం షెడ్యూల్‌ మాత్రమే విడుదల చేశారని వివరణ.. 4 అంశాల ఆధారంగా జీవో 9 ఛాలెంజ్‌ చేస్తున్నామన్నారు.  వన్‌మ్యాన్‌ కమిషన్‌ నివేదిక బయటపెట్టలేదు.. ట్రిపుల్‌ టెస్టు లేకుండానే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్నారు.  అసెంబ్లీలో రిజర్వేషన్‌ బిల్లు ఎప్పుడు పాసైందని చీఫ్ జస్టిస్ వాదనల సమయంలో అడిగారు. ఆగస్ట్‌ 31 రెండు సభల్లో పాసైందని గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందని  తెలిపారు. చట్టంగా ఇంకా  మారలేదన్నారు.