BRS MLA Padi kaushik Reddy Presented At Magistrate: అక్రమ అరెస్టులకు తాను భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) తెలిపారు. మంగళవారం కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్ నుంచి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా.. పోలీస్ వాహనం నుంచే ఆయన మీడియాతో మాట్లాడారు. 'అమ్ముడుపోయిన ఒక ఎమ్మెల్యేను నిలదీసినందుకు నాపై అక్రమ కేసులు పెట్టారు. పండుగ పూట రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటాను. జై తెలంగాణ.' అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు పోలీస్ స్టేషన్‌లోనే కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.


కాగా, కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రుల సమీక్ష సమావేశం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. 'నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి.?' అంటూ నిలదీశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో వేర్వేరుగా 3 కేసులు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం సాయంత్రం కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. అటు, కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్


అటు, కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు. నేతలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


'2 కేసుల్లో అరెస్ట్'


బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని 2 కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ లీగల్ టీమ్ తెలిపింది. సోమవారం సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసి హైడ్రామా క్రియేట్ చేశారని.. 2 కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో ఏమైనా మారుస్తారేమో చూడాల్సి ఉందని పేర్కొంది. కాగా, పాడి కౌశిక్‌రెడ్డిపై మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ వన్ టౌన్‌లో 3 కేసులు, త్రీటౌన్ పీఎస్‍‌లో 2 కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు లీగల్ టీమ్‌కు తెలిపారు.


ఇలా అరెస్ట్..


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొని బయటకు వస్తుండగా.. దాదాపు 35 మంది పోలీసులు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య ఆయన్ను కరీంనగర్ తరలించారు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో రసాభాసగా మారగా.. వేర్వేరు ఫిర్యాదుల మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.


Also Read: Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..