Harish Rao letter to Revanth Reddy: హైదరాబాద్: రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం (Gruha Jyothi Scheme) తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారు. కానీ ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
‘ఇలాగైతే, వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. తానివ్వాల ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరుతున్నాను. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించాలి. మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని’ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించారు.
‘తెలంగాణలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారు. మిగతా వారికి నష్టం కలుగుతుంది. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారు. ఇది సరైంది కాదు.
ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తున్నది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నాను. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చూడాలి. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుంది. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుంది. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే, వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని’ హరీష్ రావు డిమాండ్ చేశారు.
Harish Rao Letter To Revanth: అలా చేయకపోతే గృహ జ్యోతి పథకం నామమాత్రమే, సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
ABP Desam
Updated at:
05 Mar 2024 05:56 PM (IST)
Gruha Jyothi Scheme Harish Rao: గృహ జ్యోతి పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.
అలా చేయకపోతే గృహ జ్యోతి పథకం నామమాత్రమే, సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
NEXT
PREV
Published at:
05 Mar 2024 05:56 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -