Harish Rao warns police officers: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. ఏపీలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు ప్రస్తుతం పట్టిన గతే ఇక్కడి అధికారులకు కూడా పడుతుందని, రిటైర్ అయినా లేదా విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు.
పాలన గాలికి వదిలేసి షోకులు చేస్తున్న రేవంత్
కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తిగా రక్షణలో పడిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి రాత్రి వేళల్లో చిట్‌చాట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవడం తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఓయూకు ఒంటరిగా వస్తానని చెప్పిన సీఎం, వేలాది మంది పోలీసుల పహారాలో, విద్యార్థి నేతలను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు.
బ్రోకర్ల సలహాలతో నడుస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఒక కన్సల్టెన్సీ కంపెనీ తో పోల్చిన హరీష్ రావు, ప్రభుత్వం ముంబై బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల్లో 20 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, రేసింగ్ వంటి అంశాలను తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు.
అసెంబ్లీ 15 రోజుల పాటు నిర్వహించాలి
అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని, అప్పుడే ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెడతామని సవాల్ విసిరారు. రుణమాఫీ కాలేదని దేవుడిపై ఒట్టేసి చెప్పినా తనపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని, కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదని హితవు పలికారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కుట్రలు చేసినా మరింత ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడుతామని హరీష్ రావు తేల్చి చెప్పారు.