9 Years For Telangana Bill :  తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలకమైన రోజుగా ఫిబ్రవరి 18కి  గుర్తింపు ఉంది.ఆ రోజున తెలంగాణ  బిల్లు ఆమోదించారు.  2014 ఫిబ్రవరి 14న హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే 'రాష్ట్ర పునర్విభజన బిల్లు'ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.తర్వాత పరిణామాలతో  సభలో గందరగోళానికి కారణమైన 16 మంది ఎంపీలను స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.  2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది.  బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించినట్లు స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.  లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ పరిపూర్ణ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు.  రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.  'ది బిల్ ఈస్ పాస్డ్' అని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తయింది.           


 అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది. అక్కడి నుంచి 2014 మార్చి 1 దాకా.. రాష్ట్రపతి ఆమోదముద్ర పడే వరకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది.ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష అక్షర రూపం దాలుస్తూ.. 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జూన్‌ 2ను ప్రకటించారు.                       


ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో అనాటి ఫోటోను జత చేసి ఆనందం వ్యక్తం చేశారు. 





తెలంగాణ బిల్లు లోక్ సభలో పాస్ కావడమే అత్యంత కీలకం. అయితే ఈ బిల్లు తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేలా చేసినా.. ఆంధ్రాలో మాత్రం వ్యతిరేకతకు కారణం అయింది. తెలంగాణ ఇప్పుడు రెండో సారి  ప్రత్యేక రాష్ట్రంగా ఎన్నికలకు వెళ్తోంది. 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. కానీ అపాయింట్ డే మాత్రం తర్వాత ఖరారయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేసీఆరే సీఎంగా ఉంటున్నారు.