Harish Rao :  ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తనపై చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగిందని తెలిపారు. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.  


ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నానని.. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానని తెలిపారు. ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం అండగా నిలిచే నా పై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరువు భత్యాలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని.. పీఆర్‌సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.  





 


మరో వైపు హరీష్ రావు  800 మంది మ‌హిళ‌ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సిద్దిపేట‌లోని బాబు జ‌గ్జీవ‌న్ రామ్ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. సిద్దిపేట అర్బ‌న్, నంగునూర్ మండ‌లాల‌కు చెందిన 800 మంది మ‌హిళ‌లు ఉచిత కుట్టు మిష‌న్ శిక్ష‌ణ పొందారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న అనంత‌రం వారంద‌రికి ఉచితంగా కుట్టు మిష‌న్లు అంద‌జేశారు హ‌రీశ్‌రావు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావుకు ల‌బ్దిదారులు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. హ‌రీశ్‌రావుకు ఎంతో రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు.