Harish Rao complained EC: జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించారు.
హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం.. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిరయాదు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరామని.. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నామని.. పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లామని.. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించామమన్నారు. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని కోరామన్నారు. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదని.. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారు. ఫేక్ ఐడి కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగిందన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగము, ఫేక్ ఐడీ కార్డుల వివరాలను అందించాము. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారుని తెలిపారు.
యూసుఫ్ గూడాలో కాంగ్రెస్ కార్యాలయమును ఆనుకొని పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్కు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈరోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడని.. ఈ రోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.