Harish Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌ (Telangana  Bhavan)లో పెద్దపల్లి జిల్లాకు చెందిన బీజేపీ నేత రాములు యాదవ్‌, ఓదెల జెడ్పీటీసీ తాటి కృష్ణ, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు రేగుల తిరుపతి, ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గ్యారనేని నాగరాజు యాదవ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రవియాదవ్‌ హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా వేసి పార్టీలోనికి ఆహ్వానించారు.


అనంతరం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి రైతు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు రైతులకు రైతుబంధు ఇచ్చి బిచ్చగాళ్లలా మార్చిందన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.  రైతుబంధు సొమ్మును భిక్షం అంటూ అవమానించిన ఆయనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య అసలు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. 


రైతులు అంటే గౌరవం లేదు


రేవంత్‌ రెడ్డికి రైతులంటే కనీస గౌరవం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్న రేవంత్‌కు వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ ముఠా చేతుల్లోకి వెళ్లిందన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్‌, రేవంత్ గొప్పలు చెబుతున్నారని, కానీ, అక్కడ 2 గంటల కరెంటు కూడా ఇవ్వట్లేదని స్వయంగా జేడీఎస్‌ నేత కుమారస్వామి చెప్పారని తెలిపారు. 


'హార్స్‌పవర్‌ అంటే తెలుసా?'


రేవంత్‌ రెడ్డికి కనీసం హార్స్‌పవర్‌ అంటే తెలుసా? అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తన స్వార్థం కోసం రేవంత్‌రెడ్డి పార్టీలు మారుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా రేవంత్‌రెడ్డి పదవిని పట్టుకుని వేలాడాడని ఆరోపించారు. పైగా తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టాడని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు.


'లంబాడీలు అంటే అంత చులకనా?'


లంబాడీలకు క్వార్టర్‌ మందు ఇస్తే ఓటు వేస్తారని రేవంత్ అవమానకరంగా మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు. లంబాడీలు అంటే అంత చులకనా అంటూ ప్రశ్నించారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ పట్ల రేవంత్‌ రెడ్డి దుర్మార్గమైన భాష వినియోగిస్తున్నాడని, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు.


చిట్టచివరి ఎకరాకు నీరు


సీఎం కేసీఆర్‌ పాలనలో పెద్దపల్లి జిల్లాలోని చిట్ట చివరి భూముల వరకు సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు, రేవంత్‌రెడ్డికి పొంతన ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో భూముల విలువ పెరిగిందన్నారు. సుపరిపాలనతో రైతును రాజును చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు. కాంగ్రెస్ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.


కర్ణాటకలో కరువే


కర్ణాటకలో ఎటుచూసినా కరవే కనిపిస్తోందని, కేసీఆర్‌ పాలనలో గ్రామాల్లో కరవు లేదన్నారు. కేసీఆర్ పాలనలో భూముల ధరలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేదని, కేసీఆర్ అంటే నమ్మకం.. ప్రజలకు ఒక భరోసా అని అన్నారు. మోసాలు చేసే కాంగ్రెస్‌, బీజేపీని తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. రైతుబంధు సాయం ఆపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతులు బాగుపడడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్లు సమృద్ధిగా పండుతున్నాయని, ఛత్తీస్‌గఢ్‌ వడ్ల నమూనా మనకు ఎందుకని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హరీష్ రావు కోరారు.