Telangana News: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీ నేతలు పరస్ఫర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అప్పట్లో హరీశ్‌ రావుకు మంత్రి పదవి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి ఓ పాత వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఢిల్లీలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడినట్లుగా ఉంది. పైగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతుంటే.. వెనుక రేవంత్ రెడ్డి తొంగి తొంగి చూస్తున్నారు. ఈ వీడియోతో హరీశ్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు.


‘‘రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ఎస్‌నే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు.


పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు.’’ అని హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.