Telangana News: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ బంధు పేరుతో మైనార్టీలకు రూ. లక్ష ఇచ్చే పథకాన్ని ఇటీవల ప్రకటించింది. అప్పుడే అమలు చేసేందుకు తేదీని ఖరారు చేసింది. ఈనెల పదహారో తేదీ నుండే చెక్కుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. వీరందరికీ 16 నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని హరీష్ రావు స్పష్టం చేశారు. స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజమ్‌ల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఇప్పటికే కేటాయించిన రూ. 270 కోట్లకు అదనంగా, మరో రూ. 130 కోట్లు కేటాయించి మొత్తం రూ. 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించామని మంత్రి ప్రకటించారు.
ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం రూ. లక్ష ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించనన్నారు. ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హరీష్ రావు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను కోరారు. షాదీ ముబారక్‌కు సంబంధించి, ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే ఉపశమన సొమ్ము అందేలా చూస్తామన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెలలోనే వస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. అందుకే.. కేసీార్ ప్రకటించిన పథకాలన్నింటినీ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. పథకం ప్రకటన చేసిన మూడు వారాల్లోనే అమలును ప్రారంభించేస్తున్నారు. ఇప్పటికే బీసీ బంధును ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా లబ్దిదారుల ఖాతాల్లో నగదు పడేలా .. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.