Harish Rao alleged that 180 Farmer Suicide in Congress Rule: హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) విమర్శించారు. మాజీ మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలతో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు. లక్ష్మీభాయి తండాకు వెళ్లినప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు, ఆవేదన తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. ఒకరైతు సత్తెమ్మ పొలంలోకి వెల్లి చూడగా 4 బోర్లు వేస్తే చుక్క నీరు పడలేదు. బావుల పూడిక తీసేందుకు క్రేన్లను అద్దెకు తీసుకుంటున్నారు. దాదాపు రూ.4 లక్షల రూపాయాలు అప్పు అయిందని, తమ దృష్టికి వచ్చిందన్నారు హరీష్ రావు.


కేసీఆర్ 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి లేదు.. 
లక్ష్మీ అనే రైతు 6 బోర్లు, జంకు 9 బోర్లు, శివశంకర్ 6 బోర్లు, విజయ 4 బోర్లు వేసినా నీళ్లు సరిగా రాక.. మరోవైపు ప్రభుత్వం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, గత 10 ఏళ్లలో తమకు ఇలాంటి పరిస్థితి తొలిసారి వచ్చిందని తండా వాసులు చెప్పినట్లు గుర్తుచేశారు. హరీష్ రావు మాట్లాడుతూ.. ‘కేవలం 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే, ప్రజా సమస్యలు వీరికి పట్టవని తేలిపోయింది. కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. కానీ ప్రజల దృష్టి మరల్చేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ లేక, రైతు బంధు రాకపోవడం, కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు రాదో తెల్వక రైతులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండపోవడం, వడగళ్ల వాన, అకాల వర్షాలతో మొత్తం 20 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. రైతులను కలిసిన మంత్రి ఉన్నాడా. లేక రైతులకు ప్రభుత్వం ఉందని అధికారులను పంపించి అయినా భరోసా కల్పించారా.



గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఒక్కరైతు కూడా బోర్లు వేయలేదు. కానీ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో బోర్లు వేసి అప్పులై ఆత్మహత్యలు, కొత్త మోటార్లు కొనుక్కోవడం, క్రేన్లు తీసుకొచ్చి ఖర్చు చేయడం చూస్తున్నాం. డబ్బులు చెల్లించాలని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపిస్తోందని’ ఓ వీడియోను సైతం ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి తమకు సంబంధం లేదని అధికారులు చెప్పినట్లుగా ఉన్న వీడియోను హరీష్ రావు మీడియా ఎదుట ప్రదర్శించారు. 
రైతులకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు..
సంగారెడ్డిలో అప్పులు కడతారా, లేక కేసులు పెట్టాలా అని బ్యాంకు అధికారులు ప్రజల్ని, రైతుల్ని వేధిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడమే కారణమని చెప్పారు. రైతుల కోసం మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ మోసం, రైతులకు, కౌలు రైతులకు ఏకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12000, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పెద్ద దగా అని హరీష్ రావు మండిపడ్డారు.