Moscow Concert Hall Attack Updates: మాస్కో ఉగ్రదాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో నలుగురు ఉగ్రవాదులున్నట్టు వెల్లడించారు. వీళ్లలో ముగ్గురు ఉగ్రవాదులు నేరాన్ని అంగీకరించారు. కాన్సర్ట్ హాల్‌లో దాడికి పాల్పడింది తామే అని కోర్టుకి వెల్లడించారు. ఈ నలుగురినీ కోర్టు మే 22వ తేదీ వరకు ప్రీ ట్రయల్ కస్టడీలో ఉంచాలని తేల్చి చెప్పింది. తజికిస్థాన్‌కి చెందిన ఈ నలుగురినీ కస్టడీలోనే ఉంచాలని స్పష్టం చేసింది. ఈ నలుగురు ఉగ్రవాదులూ అఫ్గనిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్-ఖొరాసన్‌ (ISIS-K) ముఠాకు చెందినవారిగా  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లలో ఇప్పుడు ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నారు. మరో ఉగ్రవాది మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మిగతా ముగ్గురికీ గాయాలతోనే కోర్టులో కనిపించారు. ఈ ఉగ్రవాదుల్ని రష్యా-బెలారస్ సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా సంస్థ Channel One  వెల్లడించింది. ఆ గ్రామంలోనే ఓ చోట వాళ్లని బంధించి విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఎందుకీ దాడి చేశారని విచారించగా..డబ్బు కోసమే చేసినట్టు ఉగ్రవాదులు చెప్పినట్టు సమాచారం. కాల్పులకు ముందే సగం పేమెంట్ తీసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విచారణలో భాగంగా ఆ ఉగ్రవాదులపై అధికారులు చేయి చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 


ఏం జరిగిందంటే..?


మార్చి 23వ తేదీన సాయంత్రం మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. మిలిటరీ దుస్తుల్లో ఉండడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. లోపలికి వచ్చీ రాగానే వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హాల్‌లోకి గ్రనేడ్‌లు విసిరారు. ఈ కాల్పుల ధాటికి ప్రాంగణం అంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైకప్పు ఊడి కిందపడిపోయింది. లోపలున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. కొంత మంది సీట్ల వెనకాల దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకొందరు టాయిలెట్‌లోకి వెళ్లి దాక్కున్నారు. కానీ...టాయిలెట్స్‌లోకి వెళ్లి మరీ ముష్కరులు కాల్పులు జరిపారు. అంతా అటూ ఇటూ పరిగెడుతుంటూ వెంటాడి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లలో చాలా మంది మృతి చెందారు. ఈ దాడి చేసింది తామే అని ఐసిస్‌-కే ప్రకటించింది. అటు ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే ఈ ఉగ్రదాడి జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ దాడి వెనకాల కచ్చితంగా ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్ని ఉక్రెయిన్ కొట్టి పారేసింది. తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఆపడం లేదు. వాళ్లు ఈ దాడికి పాల్పడిన తరవాత ఉక్రెయిన్‌ వైపుగా వెళ్తుండడాన్ని గుర్తించినట్టు స్పష్టం చేశారు.


Also Read: ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో భారీ అగ్ని ప్రమాదం, 14 మంది పూజారులకు తీవ్ర గాయాలు