Mahakaleswar Temple Fire: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వస్త్రం అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఇండోర్ కు‌ తీసుకెళ్లారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్‌ గౌర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వారు ఉన్నారు.






"ఈ ప్రమాదంలో 14 మంది పూజారులు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి కొంత మందికి చికిత్స అందిస్తున్నాం. 8 మందిని ఇండోర్‌కి తరలించాం. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. జిల్లా పంచాయతీ సీఈవోతో పాటు అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుంది. మూడు రోజుల్లో దీనిపై ఓ నివేదిక తయారు చేస్తాం"


- ఉన్నతాధికారి


ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో కొంత మంది వీవీఐపీలు, భక్తులు ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆలయ సిబ్బంది, పూజారులు మాత్రమే గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. 


"ఈ ప్రమాదంలో కొంతమంది పూజారులు గాయపడ్డారు. ఇండోర్, ఉజ్జెయిన్‌లోని హాస్పిటల్స్‌కి వాళ్లని తరలించి చికిత్స అందిస్తున్నాం. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాను. బాధ్యులను కచ్చితంగా శిక్షిస్తాం"


- మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి 


ఈ ప్రమాదంపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో మాట్లాడినట్టు తెలిపారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.