తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతా బాగున్నప్పుడు ఆప్తమిత్రులుగా ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్‌ మధ్య ఇప్పుడు కనిపించని పోటీ కనిపిస్తోంది. ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి కేసీఆర్ ప్రధానంగా హరీష్‌రావునే ప్రయోగిస్తున్నారు. అంతే కాదు ఆయన ఇప్పటి వరకూ నిర్వహించిన పదవులు కూడా హరీష్‌రావుకే దక్కుతున్నాయి. ఈటల రాజేందర్‌ను క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్ చేసినప్పుడు ఆయన నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖలోని కొన్ని కీలక బాధ్యతలు అనధికారికంగా హరీష్‌రావుకు అప్పగించారు. మామూలుగా అయితే ఆ శాఖలన్నింటినీ ముఖ్యమంత్రికి బదలాయించారు. కానీ సీఎం కేసీఆర్ ఆ శాఖలను నేరుగా చూడలేరు కాబట్టి కొన్ని బాధ్యతలను కేటీఆర్‌కు.. మరికొన్ని బాధ్యతలను హరీష్‌రావుకు ఇచ్చారు. అప్పట్లో కరోనా పరిస్థితుల్ని పూర్తిగా హరీష్ రావే సమీక్షించేవారు. 


ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ పదవి కూడా హరీష్‌రావుకే లభించింది. నిన్న నిన్నామొన్నటి వరకూ ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పట్లో ఏసీబీ సోదాలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని ఎగ్జిబిషన్ సొసైటీ ఖండించింది. ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున .. గౌరవంగా మాత్రమే ఆయనను అధ్యక్షుడిగా ఉంచామని రోజువారీ కార్యకలాపాలతో ఆయనకు సంబంధం లేదని ప్రకటించారు. ఆ తర్వాత ఏసీబీ సోదాల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 


ఇప్పుడు హరీష్‌రావును సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. హరీష్ రావు కూడా అందుకు అంగీకరించారు. దాంతో సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా  హరీశ్ రావు ఎన్నికయినట్లు  యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు  కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని..  హరీష్ రావు హమీ ఇచ్చారు. నాంపల్లిలో ప్రతీ ఏటా జరిగే నుమాయిష్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. కొన్ని విద్యా సంస్థలు ఈ సొసైటీ కింద నడుస్తూంటాయి. 
 
ఈటల  ఇప్పటి వరకూ నిర్వహించిన బాధ్యతలు హరీష్‌రావు అందడమే కాదు.. ఈటలను రాజకీయంగా ఓడించే బాధ్యతలు కూడా హరీష్‌రావుకే ఇచ్చారు కేసీఆర్. హుజూరాబాద్‌ ఇంచార్జిగా ప్రస్తుతం హరీష్ రావే వ్యవహరిస్తున్నారు. ఈటల వర్సెస్ హరీష్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు పాత మిత్రుల మధ్య అనేకానేక సారూప్యతలు కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఉద్యమంలో పోటాపోటీగా పని చేసిన వీరు ఇప్పుడు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాడుతున్నారు. ఎవరిది పైచేయి అవుతోందనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.