Praja Samgrama Yatra : బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. హనుమకొండ భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించారు. మూడో విడత చివరి రోజు బండి సంజయ్ 14 కిలోమీటర్లు నడిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు.
ముగిసిన పాదయాత్ర
బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న తేదీ నుంచి 27 వరకు జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. మొత్తం 26 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడో విడత పాదయాత్ర చేశారు బండి సంజయ్. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది.
మూడో విడత యాత్రలో టెన్షన్
బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉద్రిక్తంగా సాగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆగస్టు 15న జనగామ (Janagama) జిల్లాలోని దేవరుప్పుల (Devaruppula) మండల కేంద్రం నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్ మాట్లాడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర
జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్ బీజేపీ నేతల అరెస్టులను నిరసిస్తూ దీక్షకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కరీంనగర్ తరలించారు. ఆ తర్వాత వర్ధన్నపేట పోలీసులు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర కొనసాగింపుపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు నోటీసులు కోర్టు సస్పెండ్ చేయడంతో ఆగస్టు 26 తిరిగి పాదయాత్ర ప్రారంభించారు బండి సంజయ్. ఈ పాదయాత్ర నేటితో ముగిసింది. అయితే మూడో విడత పాదయాత్ర సక్సెస్ అయిందనే చెప్పాలి. పాదయాత్ర అద్యంతం బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
Also Read : TS BJP Cine Glamour : తెలంగాణ బీజేపీకి స్టార్ అట్రాక్షన్ ! పిలిస్తే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా !?