IND vs PAK, Asia cup 2022: ఇండియా.. ఇండియా..! క్రికెట్‌ మైదానంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు దుమ్మురేపుతుంటే వినిపించే అరుపులివి! బ్యాటర్లు సిక్సర్లు కొడుతుంటే వినిపించే ఆ కేకలు లయబద్ధంగా అనిపించేవి. బౌలర్లు వికెట్లు పడగొడుతుంటే వినిపించే ఈలలు వినసొంపుగా ఉండేవి. ఆటగాళ్లకు అవి మరింత ఊపునందించేవి.


అప్పటి వరకు విశ్వ వేదికపై టీమ్‌ఇండియాదే పైచేయి! దాయాది జట్టుతో తలపడ్డ ప్రతిసారీ భారత్‌ అదరగొట్టేది. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు, టీవీ వీక్షకులకే ఒత్తిడి గానీ తమకేం లేదన్నట్టుగా రెచ్చిపోయేది. బ్యాటర్లైతే సునాయాసంగా పరుగుల వరద పారించేవాళ్లు. బౌలర్లు కీలక సమయాల్లో టప టపా వికెట్లు తీస్తూ ప్రత్యర్థికి వణకు పుట్టించేవారు!


అలాంటి టీమ్‌ఇండియాకు ఒక్కసారిగా షాక్‌! గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మనకు వణుకు పుట్టించింది. దుబాయ్‌ క్రికెట్‌ మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు చుక్కలు చూపించారు. మెరుపు బంతులతో టాప్‌, మిడిలార్డర్‌ను కూల్చేశారు. ఇక ఓపెనింగ్‌ బ్యాటర్లైతే భారీ లక్ష్యాన్ని ఉఫ్‌! అని ఊదేశారు. ఇండియా.. ఇండియా అని ఆనందంతో కేరింతలు కొట్టే అభిమానుల నోర్లు కట్టేశారు. సైలెంట్‌గా కూర్చోబెట్టేశారు. చేదు గుణపాఠం నేర్పించారు.


మళ్లీ అదే దుబాయ్‌లో, ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్‌ ఆదివారం తలపడుతున్నాయి. టైమ్‌ అదే, వేదిక అదే, ప్రత్యర్థి అదే, టోర్నీ అలాంటిదే! మ్యాచుకు ముందు మరొక్కసారి ఆ చేదు గుణపాఠం తల్చుకోవడం హిట్‌మ్యాన్‌ సేనకు అవసరం. ప్రతీకారం తీర్చుకొని మీసం మెలేయాలన్న అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చాలంటే ఆ గుణపాఠం గుర్తుచేసుకోవడం మరొక్కసారి అవసరం. నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యర్థి జట్టులోని ప్రతి ఒక్కరిపై వ్యూహాలు రచించేందుకు ఆ గుణపాఠం నెమరేసుకోవడం అవసరం.


గతేడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మొదట తలపడింది పాకిస్థాన్‌తోనే! ఆరంభమే అద్దిరిపోతుందని అంతా అంచనా వేశారు. కానీ ప్రత్యర్థి జట్టు పది వికెట్ల తేడాతో గెలవడంతో ఆశలు అడియాసలే అయ్యాయి. కనీసం సెమీ ఫైనల్‌కు చేరుకోలేక టీమ్‌ఇండియా తల్లడిల్లిపోయింది. ఆ మ్యాచులో టాస్‌ గెలిచిన వెంటనే పాకిస్థాన్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కేఎల్‌ రాహుల్, రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌కు దిగారు. కుర్రాడు షహిన్‌ షా అఫ్రిది బంతి అందుకున్నాడు. ఆ..! ఏముంది! కుర్రాడే కదా! అనుకున్నారు. కానీ కుర్రోడే టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేసేశాడు.


ప్రచండమైన వేగం, అద్భుతమైన స్వింగ్‌తో నాలుగో బంతికే రోహిత్‌ (0)ను ఎల్బీ చేశాడు. మూడో ఓవర్లో రాహుల్‌ (3) వికెట్‌ ఎగరగొట్టాడు. మరికాసేపటికే సూర్యకుమార్‌ (11)ను హసన్‌ అలీ ఔట్‌ చేశాడు. ఒత్తిడిలో కింగ్‌ కోహ్లీ (57), రిషభ్ పంత్‌ (39) విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే ఊహించినంత దూకుడుగా ఆడలేదు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 100కు చేరింది. జోరు పెంచే సమయంలోనే విరాట్‌ను మళ్లీ అదే అఫ్రిది ఔట్‌ చేశాడు. మొత్తంగా టీమ్‌ఇండియా 151/7తో నిలిచింది. సరే! మనవైపు భీకరమైన బౌలర్లు ఉన్నారు! పాక్‌ను అడ్డుకుంటారులే అనుకుంటే అదీ జరగలేదు. బుమ్రా, భువీ, షమి, వరుణ్‌, జడ్డూ వికెట్లు తీయలేకపోయారు. కనీసం పరుగుల్నీ నియంత్రించలేక ఇబ్బంది పడ్డారు. మహ్మద్‌ రిజ్వాన్‌ (79), బాబర్‌ ఆజామ్‌ (68) ఇద్దరే టార్గెట్‌ కొట్టేసి తొలిసారి విశ్వ వేదికపై భారత్‌ను ఓడించారు. ఆసియాకప్‌ గెలవాలంటే హిట్‌మ్యాన్‌ సేన ఈ గుణపాఠం మర్చిపోవద్దు.