ఆసియా ఖండంలోని అగ్రశ్రేణి జట్ల మధ్య ఆసక్తికర సమరానికి అంతా సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత.. ఆసియా కప్ నేటినుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ పోరు తొలి మ్యాచ్ లో శ్రీలంక- అఫ్ఘనిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. కరోనా కారణంగా ఈ టోర్నీ రెండు సార్లు వాయిదా పడింది. వేదిక శ్రీలంక నుంచి యూఏఈకి మారింది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి.
ఈసారి టీ20 ఫార్మాట్
ఈసారి ఆసియా కప్ మ్యాచ్ లను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. 2016 నుంచి ఆసియా కప్ తర్వాత ఏ ప్రపంచకప్ ఉంటే ఆ ఫార్మాట్ లో టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో ఆసియా కప్ కూడా టీ20 ఫార్మాట్ లోనే ఉండనుంది. తొలి మ్యాచ్‌లో నేడు శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. శనివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
పోటీ ఎక్కువే
ఈసారి ఆసియాకప్ రసవత్తరంగా జరగడం ఖాయమనిపిస్తోంది. పోటీలో ఉన్న జట్లన్నీగత కొన్నేళ్లుగా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాయి. హాంకాంగ్ ను మినహాయిస్తే బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్ జట్లు అత్యుత్తమమైనవే. బంగ్లా, అఫ్ఘాన్ తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలవు. ఇక పాక్ కూడా కొన్నాళ్లుగా మంచి ఫాంలో ఉంది. కాబట్టి పోటీలు ఉత్కంఠగా ఉంటాయనడంలో సందేహం లేదు.
తుది జట్టుపై అంచనా
ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. అన్ని జట్లు తమ తుది జట్టును తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. అందుకు వారికి ఈ ఆసియా కప్ టోర్నీ మంచి అవకాశంగా మారింది. ఈ టోర్నీలో దిగే జట్టుతోనే దాదాపుగా ప్రపంచకప్ కు బరిలో దిగుతారు. కాబట్టి తమకున్న వనరుల్లో మంచి జట్టును తయారు చేసుకునే ఆలోచనతో ఉన్నారు.
కప్ పై కన్నేసిన భారత్
7 సార్లు ఆసియా కప్ విజేత అయిన భారత్.. ఈసారి టోర్నీ అందుకోవాలనే నిశ్చయంతో ఉంది. బుమ్రా దూరమైన తరుణంలో పేస్ బౌలింగ్ లో అనుభవ లేమి తప్ప.. మిగిలిన అంశాల్లో బలంగానే ఉంది. అయితే ముఖ్యంగా అందరి కళ్లూ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ.. ఈ కప్ లో నైనా గాడిలో పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
అన్ని జట్లు పోటీలోనే
భారత్-పాక్ మ్యాచ్ టోర్నీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నీ కలిసొస్తే ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఈ రెండు ఆదివారం తొలి మ్యాచ్ ఆడనున్నాయి. సూపర్-4కు అర్హత సాధిస్తే రెండోసారి.. ఫైనల్ కు చేరుకుంటే మూడోసారి మ్యాచ్ లు ఆడతాయి. గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్న పాకిస్థాన్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. చివరిగా 2012 లో ఆసియా కప్ అందుకున్న ఆ జట్టు.. మరోసారి కప్ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలనుకుంటోంది. కొత్త కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ శిక్షణలో మంచి విజయాలు సాధిస్తున్న శ్రీలంక కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అలాగే సంచలనాలకు మారుపేరైన బంగ్లా, ఆఫ్ఘాన్ లు పోటీలోనే ఉన్నాయి. కాబట్టి ఈసారి క్రికెట్ ప్రేమికులు అసలైన ఆట రూచి చూస్తారనడం అతిశయోక్తి కాదు.
భారత్ కోచ్ గా లక్ష్మణ్
ఆసియా కప్‌కు భారత జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ యూఏఈకి వెళ్లలేకపోయాడు. దీంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. జింబాబ్వేలో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.