పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషలే. టోర్నీ ఏదైనా కావచ్చు. కానీ అందులో భారత్‌ పాకిస్థాన్ మ్యాచ్‌ ఉందంటే క్రికెట్‌ అంటే తెలియని వాళ్లకు కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. టోర్నీ ఓడినా ఫర్వాలేదు. పాకిస్థాన్‌ జట్టుపై భారీ స్కోరుతో గెలవాలని కోరుకుంటారు. పాకిస్థాన్‌ జట్టు పొట్టుపొట్టుగా చితక్కొట్లాలనేది ప్రతి ఇండియన్‌ కోరుకునేది. ఇదే టీమిండియాపై మరింత ఒత్తిడి తీసుకొస్తుంది. అందుకే పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు చెమట చిందిస్తున్నారు.  


చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ తో మ్యాచ్ ను టీమిండియా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో భాగంగా.. ఆగస్టు 28న భారత్, పాక్ తలపడనున్నాయి. దీనికోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట్లో పంచుకుంది. 


ఈ వీడియాలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పదేపదే ముందుకొచ్చి బాల్ ను కొడుతున్న దృశ్యాలు అందులో చూడవచ్చు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ల బ్యాటింగ్ ను చూడవచ్చు. ఇంకా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, చాహల్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియాలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. 


ఆసియా కప్ లో తన తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నమెంట్ లో శుభారంభం చేయాలని భారత్ చూస్తోంది. అలాగే   2021 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసమే నెట్స్ లో మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 










ఇప్పటి వరకు పాకిస్థాన్, భారత్ మ్యాచ్‌లలో టాప్‌-5 హైలైట్స్ ఇవే..


1. 2010లో జరిగిన ఆసియా కప్‌ భారత్-పాక్ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్ జోక్యం చేసుకుని వాళ్లిద్దరికీ సర్ది చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ వాగ్వాదం... ఇతర ఆటగాళ్లనూ రెచ్చగొట్టింది. గౌతమ్ గంభీర్ వికెట్ పోవటంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కానీ...హర్భజన్ సింగ్ ఉన్నట్టుండి ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లాస్ట్‌ బాల్‌కి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. అప్పుడే భజ్జీని అందరూ "ఆల్‌ రౌండర్" అంటూ పొగడ్తల్లో ముంచేశారు.


2. 2012లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌...క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చింది. అదే సమయంలో బాధనూ కలిగించింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆసియా కప్‌లో ఆడిన చివరి మ్యాచ్ ఇదే కావటం అందుకు కారణం. 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలోకి దిగింది భారత్. సచిన్ 48 బాల్స్‌కి 52 పరుగులు చేశాడు. ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఫస్ట్ బాల్ నుంచే ఛేజింగ్ మొదలు పెట్టాడు. 142 బాల్స్‌కు 183 పరుగులతో సచిన్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ. భారత్‌ను విజయాన్ని అందించాడు.


3. 2014లో మీర్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది దడదడలాడించాడు. సిక్స్‌ హిట్టింగ్‌లో తనకున్న స్కిల్స్‌ని మొత్తం వాడేశాడు ఈ మ్యాచ్‌లో. రవీంద్ర జడేజా, అశ్విన్‌ బౌలింగ్‌లో విరుచుకు పడి ఆడాడు. 17 ఓవర్లలో 96 రన్స్ చేసి...భారత్‌కు 245 పరుగుల లక్ష్యాన్ని అందించింది పాకిస్థాన్. అయితే...మిడిల్ ఆర్డర్ తడబడటం వల్ల ఉన్నట్టుండి మ్యాచ్ అంతా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో 12 బంతుల్లో 34 పరుగులు చేశాడు అఫ్రిది.


4. 2016 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కూడా ఎవరూ మర్చిపోలేరు. అందుకు కారణం...మహమ్మద్ అమీర్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌పై నిషేధం ఉండగా...ఈ మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రహానే వికెట్లు తీసి మరోసారి తన టాలెంట్‌ నిరూపించుకున్నాడు. సురేశ్ రైనా వికెట్‌ను కూడా తీశాడు మహమ్మద్ అమీర్. అప్పటికి భారత్ స్కోర్ 8-3. మళ్లీ భారత్ మాస్టర్ ఛేజర్ కోహ్లీ రంగంలోకి దిగి 49 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించాడు.


5. 2018లో జరిగిన ఆసియా కప్‌లో చివరిసారి భారత్-పాక్ తలపడ్డాయి. అయితే...ఈ వార్ పూర్తిగా వన్‌ సైడ్ అయింది. భారత్‌ 238 పరుగుల లక్ష్యాన్నీ ఛేదించి విజయం సాధించింది. సూపర్ -4 లోనూ భారత్ విజయం నమోదు చేసింది.