TS BJP Cine Glamour :    ఓ వైపు కాంగ్రెస్‌ ఇంటిపోరుతో ఇరుక్కుపోతే మరోవైపు బీజేపీ ఇక యావత్‌ దేశం కాషాయమయం కావాలన్న కసితో ముందుకు పోతోంది. ఏ రోజు ఏ వ్యూహంతో ముందుకు పోతోందో తెలుసుకోవడం విపక్షాలకు కష్టంగా మారుతోంది. ఇలాంటి టైమ్‌ లో టాలీవుడ్‌ స్టార్లతో పాటు వివిధ రంగానికి చెందిన ప్రముఖులని కాషాయం పెద్దలు పిలవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.ఇంతకుముందు సినీతారలే రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తిచూపించేవాళ్లు. అలాగే పార్టీలు కూడా సినీ గ్లామర్‌ ని కాదనకుండా వాడేసుకున్నాయి ప్రజాదరణని బట్టి ఆయా సినీతారలకు పదవులను కూడా కట్టబెట్టింది. ఇది నిన్నటిమాట. ఇప్పుడు సినీ రివర్స్‌.


కళాపురం వైపు బీజేపీ చూపు ! 


కాషాయం చూపు కళారంగంపై పడింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ని ఏలేస్తోన్న టాలీవుడ్‌ స్టార్లపై పడింది. అందుకే ఇప్పుడు ఆ స్టార్‌ డమ్‌ ని పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ప్లాన్‌ లు చేస్తోంది. అందులో భాగంగానే నిన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు నితిన్‌ రేపో మాపో ప్రభాస్ ని కూడా పిలవచ్చన్న ఊహాగానాలు హడావుడి చేస్తున్నాయి.ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటనని చూసి ఫిదా అయిన అమిత్‌ షా ఆయన్ను పిలిచి మాట్లాడారని కాషాయం కవరింగ్‌ ఇచ్చింది. మరి నితిన్‌ తో ఎందుకు నడ్డా భేటీ అవుతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఎన్టీఆర్‌ లాగా నితిన్‌ ఏమన్నా స్టార్‌ హీరోనా ,అంటే అదీ కాదు. పోనీ ప్యాన్‌ ఇండియా యాక్టరా అంటే అదీ కాదు. ఓ మీడియం రేంజ్ హీరో. ఆయన తండ్రి ఓ మాములు నిర్మాత. అలాంటి హీరోతో బీజేపీ నేత నడ్డా ఎందుకు భేటీ అవుతున్నారన్నదే ఇప్పుడు చర్చ. 


బరిలోకి టాలీవుడ్ స్టార్లను రంగంలోకి దింపాలనుకుంటున్నారా? 


రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి టాలీవుడ్‌ స్టార్లని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో భాగమే ఇదంటున్నారు. టాలీవుడ్‌ లో ఏపీకి చెందిన కళకారులే ఎక్కువ. తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా తక్కువమంది ఉన్నారు. అందుకే కళారంగాన్ని కేరాఫ్‌ గా చేసుకొని ఇక్కడి స్టార్లతో తెలంగాణలో కాషాయాన్ని కలర్‌ ఫుల్‌ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్‌ తోనే తెలంగాణకి చెందిన సినీతారగణానంత కదిలిస్తోందట. అలాగే వివిధ రంగాలకు చెందిన, ప్రభుత్వ గుర్తింపు అందుకోని ప్రముఖులనంతా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీ, కెసిఆర్‌ కి చెక్‌ పెట్టాలన్న ప్లాన్‌ ని సిద్ధం చేస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ప్రభాస్‌నూ ఉపయోగించుకునే యోచనలో బీజేపీ ! 


త్వరలో ప్రభాస్‌ ని కూడా పిలవనుందట బీజేపీ. బాహుబలి సినిమాతో యావత్‌ ప్రపంచాన్నిఆకట్టుకున్న ప్రభాస్‌ సాహోతో బాలీవుడ్‌ లో పాగా వేశాడు. వచ్చే ఏడాది ప్రభాస్‌ చేస్తోన్న బాలీవుడ్‌ సినిమా ఆదిపురుష్‌ విడుదల కాబోతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈసినిమాపై కాషాయం నేతలు కన్నేశారని ఇంతకుముందే వార్తలు వినిపించాయి. 


బీజేపీ పిలిస్తే రాక తప్పుతుందా !?


ఎన్నికల ప్రచారంలో సినీగ్లామర్‌ ఉండటం మాములే కానీ దీన్ని ఎందుకింత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారన్న దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సినీతారలకు ఆసక్తి ఉంటేనే ఎన్నికల ప్రచారానికి వచ్చేవారు. ఎవరూ బలవంతం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న వాదనలు ప్రతిరోజూ వినిపిస్తూనే ఉన్నాయి.
మోదీ-షాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఈడీ నోటీసులు, జైలు జీవితం లేదంటే రాజకీయజీవితమే లేకుండా చేస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తేవడం, సిఎంలను కుట్రరాజకీయాలతో పీఠం నుంచి దింపేయడం వంటి పనులతో బీజేపీని చూసి భయపడుతున్నారు. రాజకీయపార్టీలు, నేతలే కాదు వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు సైతం మోదీ-షాల తీరుపై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.


ఎంత మంది టాలీవుడ్ ప్రముఖులను బీజేపీ గురి పెట్టిందో !?


ఇలాంటి స్థితిలో కళారంగాన్నే నమ్ముకున్న సినీతారలు ఆపార్టీ పిలిస్తే రాకుండా ఎలా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్యాన్‌ ఇండియా సినిమాలతో అమాంతంగా కోట్లలో రెమ్యునిరేషన్‌ అందుకుంటున్న సినీతారల్లో ఎంతమంది నిజాయతీగా ఐటీ రిటర్న్స్‌ కడుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉన్న కాషాయం రేపు ఈ సినీస్టార్లు రాకపోతే ఆ పన్ను ఎగవేతనే ఎరగా వేసి పరువు తీయడం ఖాయమంటున్నారు. ఆ భయంతోనే బీజేపీ పెద్దలు పిలవగానే స్టార్లంతా పరుగులు పెడుతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.