Janasena Funds : " నా సేన కోసం నా వంతు " అంటూ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఒక్కరి నుంచి కూడా విరాళం రాకపోవడంతో బ్యాంకర్లను సంప్రందించారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. యూపీఐ అడ్రస్ విషయంలో బ్యాంకర్ల వైపు నుంచి పొరపాటు జరిగిందని తెలిసింది. రెండు రోజులుగా జనసేన పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా 7288040505@icici యూపీఐ అడ్రస్‌కు డబ్బులు పంపితే సెండ్ కావడం లేదు. దీంతో వెంటనే జనసేన పార్టీ అప్రమత్తమయింది. 7288040505 ఫోన్ నెంబర్‌కే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే చేయవచ్చని సూచించింది. ఇప్పటి వరకూ ఈ ఫోన్ నెంబర్‌కు @icici అనే అడ్రస్ యాడ్ అయింది. దాని వల్ల అకౌంట్‌కు డబ్బులు జమ కావడం లేదు. ఇప్పుడు @icici తీసేసి ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించాలని నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
3.5 లక్షల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, ఐటీ విభాగం, స్వచ్ఛందంగా పని చేస్తున్న సోషల్ మీడియా విభాగం, జనసేన ఎన్.అర్.ఐ. విభాగం, జిల్లా, అసెంబ్లీ, మండల, వార్డు ఇంఛార్జిలు, జనసేన పార్టీ వివిధ అనుబంధ విభాగాలు, వైద్యులు, వ్యాపారస్తులు, వీరమహిళా విభాగం, గృహిణులు, మహిళా ఉద్యోగులు, యువత, విద్యార్థులు, జనసేన పార్టీ శతగ్ని, పార్టీ అధికార ప్రతినిధులు తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారు . జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7288040505 గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ప్రక్రియ ద్వారా చాలా సులభంగా కనీసం రూ.10 నుంచి ఎంత మొత్తాన్నైనా పార్టీకి విరాళంగా అందించవచ్చునని జనసేన ప్రకటించింది.
పార్టీ నిర్వహణ కోసం పవన్ కల్యాణ్ అత్యధికంగా సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు. రైతు భరోసా యాత్ర నిర్వహణకు.. రైతులకు ఆర్థిక సాయం చేయడానికి రూ. ఐదు కోట్ల విరాళాన్ని పవన్ ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులతో పాటు కొంత మంది పార్టీ నేతలు కూడా విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు జనసైనికులంతా విరాళాలు ఇవ్వడానికి అవకాశం కల్పించారు.
సాధారణంగా రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున కార్పొరేట్ విరాళాలు వస్తాయి. కానీ జనసేన పార్టీకి అలాంటి విరాళాలు పెద్దగా అందడం లేదు. అందుకే ఆ పార్టీని కార్యకర్తలు..జనసైనికులే నడిపిస్తున్నారు.