మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. గాలిలోకి కాల్పులు కాల్చడం కంటే ముందే గన్ పేల్చడంతో మొదటి రౌండ్ మిస్ ఫైర్ అయింది. భారీగా జనం కిక్కిరిసిపోవడంతో గన్ మిస్ ఫైర్ అయి, తూటా జనంలో వెళ్లింది. ఎవరికి ఆపాయం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో గందరగోళం నెలకొంది. చితి దగ్గరకు జనం చొచ్చుకొనిరావడంతో,  అదుపు చేయడానికి పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరీశ్వర్ రెడ్డి కుటుంబం సభ్యులు జనాల మధ్య చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 


 పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1972 నుంచి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా, 1977 నుంచి 1983 వరకు సర్పంచ్‌గా పని చేశారు.  1983లో స్వతంత్ర అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో 56 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 


1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ పై 32,512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. హరీశ్వర్ రెడ్డి 1986-1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా , 1988-1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పని చేశారు.  1994,1999,2004,2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997 - 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా, 2001-2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. 


2012లో తెలుగుదేశం పార్టీని వీడి, ప్రస్తుత రాష్ట్ర సమితిలో చేరి పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో 5163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ప్రస్తుతం ఆయన కుమారుడు మహేశ్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా ఉన్నాడు.