గులాబ్ తుఫాన్ ప్రభావం హైదరాబాద్‌పై కూడా పడింది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ సోమవారం నుంచి బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లకు ఈవీడీఎం డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరవాసులు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వారంరోజుల పాటు ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముంపు ప్రాంతాల నుంచి బాధితుల్ని తరలించేందుకు శిరిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ 040- 2320 2813ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
సోమవారం ఉదయాన్నే హైదరాబాద్ లో వాన మొదలైంది. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో.. ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో తెలియని పరిస్థితి. వర్షం వచ్చిన ప్రతీసారి లోతట్టు ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒక్కోసారి నాలుగైదు రోజులపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్లల్లోనే ఉంటున్నారు. ఏటా మ్యాన్‌హోల్‌లో పడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది. తాజాగా మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మణికొండ గోల్డెన్ టెంపుల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న అతను.. నీటిలో గుంత కనిపించక అందులో పడిపోయాడు. నాలా వర్క్ చేసిన సిబ్బంది.. చిన్న సైన్ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. భారీ వర్షానికి ఆ సైన్ బోర్డులు కొట్టుకుపోయాయి. ఆ గుంతను గమనించకుండా వచ్చిన ఆ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు.
Also Read: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..