Mayor Vijayalakshmi met CM Revanth Reddy :   గ్రేటర్ హైదరాబాద్ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి   సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్దికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే   ఇటీవల వరుసగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ దీని  వెనుక రాజకీయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ట్రాప్‌లో పడవద్దని  ఎవరికీ చెప్పకుండా కలవొద్దని ఇటీవల ప్రతిపక్ష నేతగా సమవేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ అందరికీ చెప్పారు. పబ్లిక్  మీటింగుల్లో మాత్రమే కలిసి వినతి పత్రాలివ్వాలని సూచించారు. అయితే మేయర్ విజయలక్ష్మి రేవంత్ రెడ్డితో అనూహ్యంగా మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. 


గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు సాధించలేదు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. మేయర్ విజయలక్ష్మి తండ్రి కే.కేశవరావు  కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కీలక నేతగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్ గా కూడా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత  బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మి గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి మేయర్ సీటు పొందారు. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ కారణంగా ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు.                               


రేవంత్ రెడ్డిని కలవడానికి.. గ్రేటర్ పనులు కారణం కాదని రాజకీయాలేనని ఆమె వర్గీయులు చెబుతున్నారు. పదో తేదీన  ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. మాజీ డిప్యూటీ  మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడం మంచిదని ్నుకుంటున్నట్లుగా  చెబుతున్నారు. గ్రేటర్ లో పలువురు ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.                                                     


గ్రేటర్ పరిధిలోకి వచ్చే పటాన్ చెరు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాము  పార్టీ మారడం లేదని వారు చెబుతున్నారు కానీ.. ముందు చర్చలు జరిపారని.. కాంగ్రెస్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు పార్టీలో చేరుతారన్న చర్చ జరుగుతోంది.